● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: పట్టణంలోని పెద్ద చెరువును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం చెరువు పరిసరాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెరువు చుట్టూ సుమారు 2.5 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ట్రాక్‌ను సౌకర్యవంతంగా అభివృద్ధి చేయాలన్నారు. చెరువు పరిసరాల్లో గ్రీనరీని పెంపొందిస్తూ, షేడ్ పగోడాలు ఏర్పాటు చేసి అందమైన వాతావరణాన్ని సృష్టించేందుకు బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలన్నారు. ప్రజలకు విశ్రాంతి, వినోదం కలిగించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. చెరువు కట్టను ఆక్రమణల నుంచి రక్షించేందుకు బౌండరీ ఫిక్సింగ్, ఫెన్సింగ్, ట్రెంచెస్ ఏర్పాటు చేయాలన్నారు. చెరువు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కట్టను శాశ్వతంగా సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాలేరు వాగు, చామ కాలువలతో అనుసంధానమై సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తే, నంద్యాల పట్టణానికి ఒక విలువైన ఆస్తిగా మారుతుందన్నారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్‌ఈ శివ శంకర్ రెడ్డి, కేసీ కెనాల్ డీఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


