● భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త
ఆళ్లగడ్డ: భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెనుభూతంగా మారి చివరికి దారుణంగా హత్య చేసిన ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ నాగరాజరావు కథనం ప్రకారం.. రుద్రవరం మండలం చిత్రేనిపల్లె గ్రామానికి చెందిన చెన్నయ్య మొదటి భార్య పదేళ్ల క్రితం మృతి చెందడంతో మండల కేంద్రం రుద్రవరానికి చెందిన పుష్ప (35)ను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు చిత్రేనిపల్లెలో వ్యవసాయం చేసుకుంటూ కాపురం ఉండగా అప్పులు ఎక్కువ కావడంతో బతుకు దెరువు కోసం ఆళ్లగడ్డ చేరుకున్నారు. అక్కడ దంపతులు ఇద్దరు గౌండా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పనిచేసేచోట పుష్ప ఓ వ్యక్తితో చనువుగా ఉంటుండంతో అనుమానపడిన చెన్నయ్య కాపురం నంద్యాలకు మార్చాడు. అక్కడ బతకడం ఇబ్బందిగా మారడంతో తిరిగి ఆళ్లగడ్డ చేరుకుని చాంద్ వీధిలో ఇళ్లు బాడుగకు తీసుకుని నివాసం ఉంటున్నా రు. ఈ క్రమంలో బుధవారం రుద్రవరంలో దేవరకు పోయి రాత్రి పొద్దుపోయాక ఆళ్లగడ్డ చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఇద్దరు గొడవ పడుతూ ఆవేశంతో చెన్నయ్య భార్య పుష్ప గొంతులో కత్తెరతో పొడవగా పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను హత్య చేసి పరారైన చెన్నయ్య మధ్యాహ్నం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో తల్లి చనిపోవడం, తండ్రి జైలు పాలు కావడంతో ఇద్దరు కూతుర్లు అనాథలయ్యారు.


