● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: నిర్ణీత గడువులోపు భూ రీసర్వే పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. రీసర్వేకు సంబంధించిన ఫేజ్–1 నుంచి ఫేజ్–5 వరకు ఉన్న అన్ని దశలను వేగవంతం చేసి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, వీఆర్‌ఓలు, విలేజ్ సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. భూసంబంధిత వివాదాలు, అడ్డంకులు తక్షణమే పరిష్కరించే విధంగా అన్ని స్థాయిలలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని ప్రతి రైతుకు పట్టాదారు పాసు పుస్తకాలు మార్చి 2027 నాటికి అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మంఠంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 21 వరకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. మొత్తం రూ.3,25,96,854 సమకూరింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆదేశానుసారంగా హుండీ లెక్కింపునకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక సారి కౌటింగ్ హాల్‌లోనికి ప్రవేశించిన తరువాత ఎవరినీ ఏ కారణంతోనూ బయటకు అనుమతించలేదు. హుండీ లెక్కింపునకు ఆలస్యముగా వచ్చే వారికి ప్రవేశం లేదు అని సూచిక బోర్డును ఏర్పాటు చేసినట్లు మేనేజర్ ఎస్‌కె.శ్రీనివాసరావు తెలిపారు. నగదు రూపేణా రూ. 3,15,62,354, నాణేల రూపంలో రూ.10,34,500 వచ్చినట్లు వివరించారు. అలాగే 47 గ్రాముల బంగారం, 592 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు ఏఏఓ మాధవశెట్టి , మేనేజర్–2 వెంటేష్ జోషి,ఇంజనీర్ సురేష్‌కోనాపూర్ తెలిపారు.
పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమల పురోగతిపై బుధవారం కలెక్టరేట్‌లో తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలులో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయడం, భూసేకరణ, అవసరమైన అనుమతులు, ఇతర సమస్యలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో 38 పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు జరిగాయని, వాటిలో ఇంకా మొద లు కాని పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అశోక్‌కుమార్, ఏపీఐఐసీ జెడ్‌ఎం మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


