గ్రామంలో పూర్వం నుంచి ఉన్న శ్మశాన స్థలం రోడ్డు నిర్మాణానికి తీసుకోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్రామంలో ఎవరైనా చనిపోతే పూడ్చేందుకు ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థంకాని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి.
– సాదె పక్కీరయ్య, గోస్పాడు
శ్మశాన స్థలం రహదారి నిర్మాణంలో పోవడంతో గ్రామంలో తీవ్ర సమస్యగా మారింది. ఇప్పటికే ఉన్న స్థలం చాలక అవస్థలు పడుతుంటే తిరిగి కొత్త సమస్య తలెత్తింది. శ్మశాన స్థలం రహదారి నిర్మాణంలో పోతుందని ముందుగానే అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరం.
– శేఖర్, గోస్పాడు
గోస్పాడు: రహదారి నిర్మాణంలో భూసేకరణ సంబంధించిన వ్యవహారాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎస్సీలకు శ్మశాన వాటిక సమస్య ఎదురైంది. మండల కేంద్రమైన గోస్పాడులో ఎస్సీల్లో రెండు వర్గాల వారికి దాదాపుగా 60 సెంట్లకు పైగా శ్మశాన వాటిక స్థలం ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.23 లక్షల వ్యయంతో రెండు శ్మశానాలకు కాంపౌండ్‌లు, మెయిన్ గేట్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసింది. కాగా ఇటీవల కల్వకుర్తి– జమ్మలమడుగు రహదారి పనుల్లో రెండు శ్మశాన వాటికలు పోయాయి. వాటికి అధికారులు ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించకపోవడంతో దళితులు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సీ కాలనీ వాసులు శిలాస్, కాశన్న, బాలరాజు, అంకన్నతో పాటు దాదాపుగా వంద మందికి పైగా అక్కడి వచ్చి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సర్వేయర్ ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంతో కాలంగా ఉన్న శ్మశానాన్ని రహదారి నిర్మాణానికి తీసుకోవడంతో శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. శ్మశాన వాటిక స్థలం పోతుందని తెలిసినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే ఎక్కడ పూడ్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రస్తుతం సెంటు భూమికి ప్రభుత్వం ఎంత మేరకు చెల్లిస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉందని తెలిపారు. గ్రామానికి అవసరమైన శ్మశాన స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాలని కోరారు. శ్మశాన స్థలాన్ని అధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీంతో తహసీల్దార్ షేక్ మొహిద్దీన్ వెంటనే అక్కడున్న సర్వేయర్‌ను స్థలం పరిశీలించి నివేదిక అందించాలన్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను సాక్షి వివరణ కోరగా చుట్టుపక్కల పొలాల రైతుల భూముల ధరలు విచారించి నివేదికను తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు.
రహదారి నిర్మాణంలో రెండు ఎస్సీల శ్మశాన వాటికలు గల్లంతు
ప్రత్యామ్నాయం చూపని అధికారులు
స్థలం కేటాయించాలని
రోడ్డెక్కిన ఎస్సీలు


