● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రీ–ఓపెన్ అయిన దరఖాస్తులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సరైన ఎండార్స్‌మెంట్ ఇవ్వకపోతే ప్రభుత్వం దానిని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి, సమగ్రంగా నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లాలో 364 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాము నాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ క్లినిక్స్‌తో మెరుగైన సేవలు..
భూ సంబంధిత సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఈ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశముందన్నారు. సోమ వారం 162 దరఖాస్తులు స్వీకరించామన్నారు.


