పూలే సేవలు స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

పూలే సేవలు స్ఫూర్తిదాయకం

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

సాక్షి, నంద్యాల: సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారతకు మహాత్మా జ్యోతిరావు పూలే అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్‌ ఆర్చి వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారి తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ కొల్లాబత్తుల కార్తీక్‌, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ పూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహానుభావుడని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విద్యే ప్రధాన సాధనమని పూలే చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సీ్త్ర విద్య ప్రాధాన్యతను ఆయన ఎంతో ముందుగానే గుర్తించి, తన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో ఆడపిల్లల కోసం పాఠశాలలను స్థాపించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు రమణయ్య గౌడ్‌, జిల్లెల్ల శ్రీనివాసులు, బాలస్వామి, నాగశేషుడు, సుధాకర్‌, రామచంద్రరావు, కొమ్ము పాలెం శ్రీనివాసులు, వేణుగోపాల్‌ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement