ఆరబోసిన ధాన్యం
పాణ్యం: రబీలో వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. కేంద్ర ప్రభుత్వం సాధారణ వరికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,369, ఏ గ్రేడ్ రకానికి ?2,389గా నిర్ణయించింది. రైతులకు 75 కేజీల బస్తాకు రూ. 1,776 నుంచి రూ. 1,791 వరకు లభించాలి. అయితే మార్కెట్‌లో రూ.1,600 కూడా అందడం లేదు. మద్దతు ధర కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కష్టమే మిగిలింది!
ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల రబీ సీజన్‌లో వరి సాగు చేశారు. విత్తనం నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులను కష్టాలు వెంటాడాయి. రాష్ట్ర ప్రభుత్వం యూరియా ఇవ్వకపోవడంతో దొరికిన చోట రూ.500 వెచ్చించి బస్తా చొప్పున తీసుకున్నారు. అధిక ధరతో యురియాను కొనుగోలు చేసి పంటను కాపాడుకున్నారు. ఎకరానికి రూ. 30వేలకు పైగానే ఖర్చు రాగా దిగుబడి మాత్రం 30 నుంచి 35 బస్తాలు మాత్రమే వచ్చింది. పంట వచ్చిన వారం రోజులు మాత్రమే బస్తా రూ. 1900 వరకు పలికింది. ఇరవై రోజుల నుంచి రూ.1600తో కూడా కొనడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు కష్టమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


