● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల: నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. మహిళల భద్రత, సైబర్ క్రైం, శాంతిభద్రతల పరిరక్షణ, హత్యలు, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించాల న్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే రోడ్డు రవాణా సంస్థ, ట్రాన్స్‌పోర్ట్ డిపార్టుమెంట్ వారి సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. మహిళలు భద్రతకు పెట్రోలింగ్ పెంచడంతో పాటు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల దర్యాప్తు, పరిష్కారం, ప్రాపర్టీ నేరాలలో ముద్దాయిల అరెస్ట్, బందోబస్తు విధులు మొదలగు వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 36 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్, డీఎస్పీ రామంజి నాయక్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


