అరటి రైతుల ఆక్రందన | - | Sakshi
Sakshi News home page

అరటి రైతుల ఆక్రందన

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

● ఇరాన్‌ యుద్ధంతో నిలిచిన ఎగుమతులు ● ధర పతనంతో మూటగట్టుకున్న నష్టాలు ● తోటల్లోనే వదిలేసిన దిగుబడులు

తుగ్గలి : ఏ పంట సాగు చేసినా రైతును కుదిపేస్తున్నాయి. లాభాలు కనిపించడం లేదు. అప్పుల ఊబిలో రైతు కూరుకుపోతున్నాడు. ఈ క్రమంలో అరటి రైతు కూడా చేరాడు. ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు దెబ్బతీస్తుంటే.. మరో వైపు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ధరలు పాతాళానికి పడి పోయి అరటి రైతుకు శాపమైంది. పత్తికొండ నియోజకవర్గంలో మొత్తం 150 ఎకరాల్లో అరటి పంట సాగైంది. పంట సాగు కోసం లక్షల్లో ఖర్చు చేశారు. అరటి గెలలు కోతకు వచ్చిన సమయంలో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ధరలు పతనం కావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. అడిగే వారు లేక, మార్కెటింగ్‌ సౌకర్యం లేక తోటల్లోనే అరటిని వదిలేసి రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మార్కెట్‌లో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను అరటి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు మించి ధరలు లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. యుద్ధం ప్రారంభానికి ముందు టన్ను రూ.20 వేలకు పైగానే ధర ఉంది. ధరలు స్థిరంగా ఉంటాయని సాగులో ఆదాయం ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కోతకు వచ్చిన సమయంలో ధరలు అమాంతంగా పడిపోవడంతో తీవ్రంగా నష్ట పోతున్నారు.

కొనుగోళ్లకు ముందుకురాని వ్యాపారులు..

అరటి ధరలు మార్కెట్‌లో పడిపోవడంతో కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ధరలు ఉన్నప్పుడు తోటల వద్దకు వచ్చిన వ్యాపారులు ధరలు పడిపోగానే అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు కూడా చేతికందని పరస్థితి ఏర్పడటంతో ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement