బోరుకు తాళం తొలగింపు | - | Sakshi
Sakshi News home page

బోరుకు తాళం తొలగింపు

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

పగిడ్యాల: తూర్పు ప్రాతకోట గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన సీసీ రోడ్డుకు పక్కన ఉన్న చేతి పంప్‌నకు ఓ వ్యక్తి వేసిన తాళాన్ని పోలీసులు తొలగించారు. ‘చేతి పంప్‌ బోర్‌కు తాళం’ అనే శీర్షికతో శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ముచ్చుమర్రి ఎస్‌ఐ నరేంద్ర స్పందించారు. శుక్రవారం సిబ్బందితో ఎస్‌ఐ వెళ్లి వివరాలు తెలుసుకుని తాళాన్ని తొలగించారు. కాగా బోరు వద్ద బండలు పగిలిపోవడం వలన తాళం వేసినట్లు సమీపంలో నివాసముంటున్న వేణు భార్య రాజమ్మ పోలీసుల దృష్టికి తెచ్చారు. గతంలో ఇదే బోరుకు ప్రత్యేక మోటార్‌ అమర్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేయగా ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు చర్చించుకున్నారు.

దళితుల ఆత్మ గౌరవంపై దాడి

కోవెలకుంట్ల: నర్సీపట్నంలో డప్పుకొడుతున్న దళితుడిపై అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దాడి చేయడం వారి ఆత్మ గౌరవంపై జరిగిన దాడిగా వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసనాయక్‌ విమర్శించారు. ఈ సందర్భంగా కోవెలకుంట్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికార దర్పంతో దళితులపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనలో దళిత భాస్కర్‌రావును స్పీకర్‌ దుర్భాషలాడి దాడి చేసిన తీరు మరింత ఆవేదన కల్గిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులున్నాయన్నారు. అధికార మదంతో ఇలాంటి దాడులు చేయడం అత్యంత బాధాకరమన్నారు. దళితుల గౌరవాన్ని కించపరిచేలా చోటు చేసుకున్న ఘటనకు బాధ్యత వహించి స్పీకర్‌ ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దళిత సమాజం తరుఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడతామని హెచ్చరించారు.

మూడు గడివాములు దగ్ధం

కల్లూరు: దొడ్డిపాడు గ్రామంలో శుక్రవారం మూడు గడివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన రైతు చిన్న చాంద్‌ బాషా పశువుల మేత కోసం రెండు వేరుశనగ, ఒక సొప్ప వాము వేసుకున్నాడు. ప్రమాదవశాత్తూ గడివాములకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.

హమాలీల కూలి రేట్లు పెంచాలి

కర్నూలు(సెంట్రల్‌): సివిల్‌ సప్లై హమాలీల కూలి రేట్లను పెంచాలని ఏపీ సివిల్‌ సప్లై హమాలీ సంఘం డిమాండ్‌ చేసింది. శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లను పెంచాలని కోరుతూ రెండో రోజు కర్నూలు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో హమాలీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణ హాజరై మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్త కూలి రేట్లను పెంచకుండా కాలయాపన చేస్తోందన్నారు. జీతాలను పాత పద్ధతిలో కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను ఒక వ్యక్తి అకౌంట్‌లో వేసి ఇవ్వడం సరికాదన్నారు. అంతేకాక ఫేషియల్‌ యాప్‌ నుంచి హమాలీలకు మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయాలను కల్పించాలని కోరారు. రిటైర్‌ అయిన హమాలీకు రూ.10 వేల పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. జిల్లా కార్యదర్శి సోలోమన్‌ రాజు, బజారి, శివ, బాలరాజు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, రాజేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement