పాణ్యం: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. గోరుకల్లు గ్రామంలో శుక్రవారం విలేకరులతో కాటసాని మాట్లాడారు. తన రాజకీయ అనుభవంలో ఇంతలా టీడీపీ నాయకులు దోపిడీకి పాల్పడటం చూడలేదన్నారు. యూరియా, మద్యం, ఇసుక, ఇతర అభివృద్ధి పనుల్లో ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ఇదేమని ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులకే పనులు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారన్నారు. ఇదే అదనుగా తీసుకున్న కొందరు అధికారులు ప్రజల వినతులను కూడా స్వీకరించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల అక్రమాలపై ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారన్నారు. అక్రమ కేసులు బనాయించి సామాన్య ప్రజలను సైతం వేధిస్తున్నారన్నారు. మహిళలపై టీడీపీ నాయకులు, అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న లైంగిక దాడులపై కనీసం చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. రాజధాని పేరుతో రేట్లు పెంచి దోచుకుంటున్నారన్నారు. ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ ఉద్యమాలు ఉధృతం చేస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు వస్తాయని కాటసాని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోవడంపై వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశం అనంతరం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ రేగటి పెద్దస్వామిరెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. పెద్దస్వామి దర్గాలలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. జెట్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జింకల సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, ఉసేన్‌సా, వెంకటరామిరెడ్డి, లక్ష్మీమద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
దోచుకోవడం, దాచుకోవడం తప్ప
ఏమీ లేదు
ప్రజల తరఫున ఉద్యమాలు
ఉధృతం చేస్తాం
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి


