శ్రీశైలం టెంపుల్: ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం క్యూ కాంపెక్స్‌ల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసి సక్రమంగా పనిచేసే విధంగా ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుండాలని దేవదాయశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆకస్మికంగా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తుల దర్శన ఏర్పాట్లపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా త్వరగా దర్శనమయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైనచోట్ల చలువ పందిర్లు ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్లలోని నిర్దిష్ట ప్రదేశాల్లోని వాటరు పాయింట్లకు అంతరాయం లేకుండా నీటిసరఫరా ఉండాలన్నారు. క్షేత్రంలో పారిశుద్ధ్యం నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం కార్యదర్శి వారికి స్వామివార్ల ప్రసాదాలు, శేషవస్త్రం, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటం అందజేశారు.
30న పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 30వ తేదీన సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు ఉదయం టిడ్కో గృహాల ప్రారంభోత్సవం, మధ్యాహ్నం పీ–4 కార్యక్రమం నిర్వహణ ఉండటంతో పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేయాల్సి వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి అనవసరంగా జిల్లా కేంద్రం నంద్యాలకు వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవద్దని సూచించారు. కాగా డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్ పట్టణాలు, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు.
బీసీ హాస్టళ్లలో మధ్యాహ్న భోజనంపై విచారణ
కోవెలకుంట్ల: పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహాల్లో మధ్యాహ్న భోజనం నిలిపి వేయడంపై శనివారం అధికారులు విచారణ చేపట్టారు. బీసీ వసతిగృహాల జిల్లా అధికారి జగ్గయ్య స్థానిక బీసీ బాలుర వసతి గృహాన్ని చేరుకుని హాస్టల్ విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు మండలంలోని గుళ్లదూర్తి బీసీ బాలుర వసతిగృహాన్ని మండల ప్రత్యేకాధికారి కల్యాణి, తహసీల్దార్ పవన్‌కుమార్‌రెడ్డి చేరుకుని శుక్రవారం హాస్టల్‌లో మధ్యాహ్న భోజనం నిలిపివేయడంపై వివరాలు అడిగి తెలుసుకుని అందుకు సంబంధించిన వివరాలు నమోదు చేశారు.
1,413 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం
నంద్యాల(న్యూటౌన్): ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశం పొందేందుకు జిల్లాలో 1,856 మంది దరఖాస్తు చేసుకోగా 1,413 మంది అర్హత సాధించారని జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత లాటరీ ఫలితాలు విడుదలైనట్లు తెలిపారు. ఏప్రిల్ 7లోగా పాఠశాలకు వెళ్లి ప్రవేశాలను నిర్ధారించుకోవాలని సూచించారు.


