‘పది’ పరీక్షల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షల తనిఖీ

Mar 29 2026 6:53 AM | Updated on Mar 29 2026 6:53 AM

‘పది’ పరీక్షల తనిఖీ ● ఈగల్‌ ఐజీ రవికృష్ణ ● సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ

డోన్‌ టౌన్‌: పట్టణంలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలను జిల్లా విద్యాధికారి జనార్దన్‌ రెడ్డి తనిఖీ చేశారు. శనివారం డోన్‌కు వచ్చిన ఆయన మొదటగా పట్టణ పోలీసు స్టేషన్‌లో భద్ర పరిచిన ప్రశ్నా పత్రాలను పరిశీలించి డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలో పరీక్ష కేంద్రాలైన శ్రీసుధ, నారాయణ, జెడ్పీ గ్లర్స్‌ హైస్కూల్‌ను తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. ఆయన వెంట డోన్‌ మండల విధ్యాధికారులు ప్రభాకర్‌, రఘునాయక్‌ ఉన్నారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

కర్నూలు (టౌన్‌): జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. అందులో భాగంగానే ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌ పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. శనివారం హొళగుంద, మంత్రాలయం, చిన్న పెండేకల్‌, కర్నూలులోని వీకర్‌ సెక్షన్‌ కాలనీలలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఈగల్‌ ఐజీ మాట్లాడుతూ.. సరైన పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఏపీ ఈగల్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1972కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు డీస్పీ భార్గవి, కర్నూలు మహిళా పీఎస్‌ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

అప్పులు వద్దని..

చంద్రబాబు ఏం చేస్తున్నారు?

ఆలూరు: అప్పులు ఎక్కువ చేస్తున్నారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మర్చారని అధికారంలోకి రాక ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేస్తుందేమిటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లలో రూ 3.31 లక్షల కోట్ల అప్పులు చేశారని, చంద్రబాబు నేడు ఏకంగా రూ 3.40 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఆలూరు పాతబస్టాండు సమీపంలో శనివారం ఏఐటీయూసీ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి పాల్పడకుండా కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావుల పల్లి రవీంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.గిడ్డయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా కార్యదర్శి మునెప్ప పాల్గొన్నారు.

పాల శీతలీకరణ

కేంద్రాల్లో తనిఖీలు

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలోని పాల శీతలీకరణ కేంద్రాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల రాజమహేంద్రవరంలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్‌ కలిసిన పాలు తాగి పలువురు మరణించిన విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇథిలిన్‌ గ్‌లైకాల్‌ అనే కెమికల్స్‌ కలిసిన పాలు తాగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత పాల నాణ్యత, స్వచ్ఛతపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. దీంతో పశు సంవర్ధక శాఖ వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్‌, ఏరి యా హాస్పిటల్స్‌ ఏడీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల శీతలీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. పైప్‌లైన్‌లు ఎలా ఉన్నాయి.. శీతలీకరణకు వాడుతు న్న కెమికల్‌ ఏది.. తదితర విషయాలను పరిశీలించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ కూడా పాల శీతలీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో ఇథిలిన్‌ గ్‌లైకాల్‌ వినియోగించడం లేదని, అమ్మోనియా, ప్రియాన్‌లను వాడుతున్నారని, ఇవి ప్రమాదకరమైనవి కాదని ఆయన పేర్కొన్నారు.

గతేడాది ‘స్పాట్‌’

రెమ్యునరేషన్‌ ఇప్పించండి

నంద్యాల(న్యూటౌన్‌): గత ఏడాది పదవ తరగతి మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు రెమ్యునరేషన్‌ చెల్లించలేదని, వెంటనే ఇప్పించాలని ఏపీటీఎఫ్‌ 257 జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య కోరారు. ఈ మేరకు శనివారం డీఈఓ జనార్దన్‌రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్పాట్‌కు సంసిద్ధతను తెలిపిన ఉపాధ్యాయులనే సీనియార్టీ ప్రాతిపదికన నియమించాలన్నారు. స్పాట్‌ – 2025 రెమ్యునరేషన్‌ ఇప్పటికీ క్రెడిట్‌ కాలేదని, అలాగే కస్టోడియన్‌, పేపర్‌ కరెక్షన్‌ సంబంధించి అమౌంట్‌ చాలా మంది ఉపాధ్యాయులకు జమ కాలేదన్నారు. స్పాట్‌ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మెగా డీఎస్సీ నియామకాలకు సందర్భంలో బ్లాక్‌ చేసిన కేటగిరి–1, 2, 3 పోస్టులను రానున్న బదిలీల్లో భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ 257 నాయకులు జాకీర్‌హుసేన్‌, వీరేశ్వరరెడ్డి, దస్తగిరిబాషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement