● వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జి బుట్టా రేణుక
కర్నూలు(సెంట్రల్): ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తే పోరాటానికి దిగుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జి బుట్టా రేణుక హెచ్చరించారు. నష్టాల్లో ఉన్న ఆప్కోలో లాభాల్లో ఉన్న వీవర్స్ సొసైటీని ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్‌లను కలిసి శనివారం ఆమె వినతిపత్రాన్ని ఇచ్చారు. ఎమ్మిగనూరు అంటే చేనేతలు..చేనేతలు అంటే ఎమ్మిగనూరు అనేలా పేరు ప్రఖ్యాతులు రావడానికి వీవర్స్ సొసైటీనే కారణమన్నారు. మాచాని సోమప్ప 1938లో ఎమ్మిగనూరు వీవర్ సొసైటీని ఏర్పాటు చేసి దానికి సొంత ఆస్తులను ఇచ్చారన్నారు. దీని ద్వారా సుమారు 200 మంది మగ్గాలు నేసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఈ సొసైటీకి 16 అవుట్‌లేట్‌లు ఉన్నాయని, విలీనం చేస్తే వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మార్చి 31వ తేదీన విలీనానికి సంబంధించిన సమావేశాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు నాగేషప్ప, జిల్లా చేనేత అధ్యక్షుడు ఎంకే శివప్రసాదు, నియోజకవర్గ చేనేత అధ్యక్షుడు మీసాలబండ నీలకంఠ, 3వ వార్డు అధ్యక్షుడ చేనేత మళ్లి పాల్గొన్నారు.


