బనగానపల్లెరూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న చౌడేశ్వరిదేవి రాయబారాది జ్యోతి రథ మహోత్సవాలు బుధవారం వసంతోత్సవ కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి, అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరిదేవి, చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలకు వసంతోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులో స్వామి వార్ల విగ్రహాలకు వసంతోత్సవ పూజలు నిర్వహించి తిరిగి ఆలయాలకు చేర్చారు. ఆలయ పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.


