శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీగిరి క్షేత్రంలో నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాలకు శుక్రవారం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. చివరి రోజు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీహోమం జరిపించారు. అనంతరం యాగపూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృదం కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పూర్ణాహుతి అనంతరం వసంతోత్సవం జరిపించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు వసంతాన్ని పసుపు, సున్నం, సుగంద ద్రవ్యాలు కలిపిన మంత్రపూరిత జలాన్ని సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు. అనంతరం చండీశ్వరస్వామికి ఆలయ మల్లికాగుండం వద్ద అవభృదం, త్రిశూల స్నాన కార్యక్రమాలు జరిపించారు. అవభృదంలో రుద్రధ్యాయ మంత్రాలతో చండీశ్వరస్వామికి శుద్ధజలం, పంచామృతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళం మొదలైన వాటితో స్నపన కార్యక్రమం నిర్వహించారు. త్రిశూల స్నానం కార్యక్రమంలో భాగంగా మల్లికాగుండం జలాన్ని తలపై ప్రోక్షించడంతో పాపాలన్నీ హరించి శ్రేయస్సు కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆయా పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సకల శుభాలు ప్రసాదించే
భ్రమరాంబా..
ఉగాది మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీభ్రమరాంబాదేవి నిజరూపంలో దర్శనమిచ్చారు. అష్టభుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిగ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిచ్చారు. అమ్మవారి నిజాలంకరణ దర్శనం వలన సమస్యలన్ని తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది. అలాగే అశ్వవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించడం వలన సమస్యలు తీరిపోతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని పండితులు పేర్కొన్నారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవం నిర్వహించారు.
మల్లికా గుండంలో
చండీశ్వరుడికి త్రిశూల స్నానం
అశ్వవాహనంపై స్వామిఅమ్మవార్ల విహారం
ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఉభయ దేవాలయ ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంపై ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవమూర్తులను ఆశీనులు చేయించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు.
మల్లికాగుండం వద్ద అవభృదం,
త్రిశూలస్నానం
నిజాలంకరణలో
శ్రీభ్రమరాంబాదేవి దర్శనం
శ్రీశైలంలో ముగిసిన
ఉగాది మహోత్సవాలు


