ఫలించిన ఎస్పీ వ్యూహం | - | Sakshi
Sakshi News home page

ఫలించిన ఎస్పీ వ్యూహం

Mar 21 2026 5:16 AM | Updated on Mar 21 2026 5:16 AM

● ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా కన్నడిగుల తిరుగు ప్రయాణం ● అర్ధరాత్రిలోపే దోర్నాల, మున్ననూరు చెక్‌పోస్టులు దాటిన వేలాది వాహనాలు

● ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా కన్నడిగుల తిరుగు ప్రయాణం ● అర్ధరాత్రిలోపే దోర్నాల, మున్ననూరు చెక్‌పోస్టులు దాటిన వేలాది వాహనాలు

శ్రీశైలం: ఉగాది మహోత్సవాలకు తరలివచ్చిన భక్తజనం రథోత్సవం అనంతరం ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా తిరుగు ప్రయాణమయ్యారు. ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ప్రత్యేక వ్యూహంతో పోలీసులు వాహనాల క్రమబద్ధీకరణలో ఈ ఏడాది పట్టు సాధించారు. ఫిబ్రవరిలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కంటే ఉగాదికి అధిక సంఖ్యలో శ్రీశైలంకు వాహనాలు చేరుకున్నాయి. అధికారుల అంచనా ప్రకారం సుమారు 6 వేలకు పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన బస్సులు, టూరిస్ట్‌ బస్సులు, 15 వేలకు పైగా ఫోర్‌ వీలర్స్‌ వచ్చినట్లు అంచనా. ఉత్సవాలు ఈనెల 16 నుంచి ప్రారంభమైనప్పటికీ ఈ నెల 10 నుంచే వాహనాల తాకిడి ప్రారంభమైంది. గతంలో ఉగాది ఉత్సవాల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. బందోబస్తుకు పోలీసుల సంఖ్య పెంచడం, క్షేత్రంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే ప్రదేశాలను గుర్తించి అక్కడ డీఎస్పీ స్థాయి అధికారులను నియమించడం, డ్రోన్‌ కెమెరాలతో ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం, కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఆదేశాలు జారీ చేయడం, బ్లూ కోర్టు సిబ్బంది నిరంతరం క్షేత్ర స్థాయిలో ఉండటం వంటి చర్యలు చేపట్టారు. రథోత్సవం రోజు గురువారం ఎస్పీ క్షేత్ర స్థాయిలో బ్లూ కోర్టు వాహనంలో క్షేత్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చర్యలు చేపట్టారు. అలాగే ఆ సమయంలో అటు మున్ననూరు, ఇటు దోర్నాల చెక్‌పోస్టు నుంచి ఒక్క వాహనం కూడా శ్రీశైలం వైపు రాకుండా అడ్డుకున్నారు. గతంలో శివరాత్రి, ఉగాది ఉత్సవాల్లో నిర్వహించే రథోత్సవం అనంతరం ట్రాఫిక్‌ క్లియర్‌ కావాలంటే మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలు అయ్యేది. అలాంటిది ప్రస్తుతం ఎస్పీ ట్రాఫిక్‌ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో శ్రీశైలంలో ఉన్న అన్ని పార్కింగ్‌ ప్రదేశాలు రాత్రి 9.30 గంటలకే దాదాపు ఖాళీ అయ్యాయి. ఘాట్‌ రోడ్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా రాత్రి 11.30 గంటలకు అన్ని వాహనాలు దోర్నాల, మన్ననూర్‌ చెక్‌ పోస్టులను దాటాయని ఎస్పీ ధ్రువీకరించుకుని గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా కన్నడిగుల తిరుగు ప్రయాణం కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement