సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
శిరివెళ్ల: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై నిర్లక్ష్యం వహించిన కోటపాడు సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, శిరివెళ్ల–3వ సేవా కేంద్రం సర్వేయర్, గోవిందపల్లె సిబ్బందికి షోకాజ్ నోటీస్‌లు జారీ చేసినట్లు ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప బుధవారం తెలిపారు. ఈ నెలాఖరులోగా సర్వే వంద శాతం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి నెల పంపిణీవుతున్న సామాజిక పింఛన్ల డబ్బు లు పంపిణీ అనంతరం మిగిలిన డబ్బులను గడువులోగా కోటపాడు సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ చెల్లించడం లేదన్నారు. అతనికి ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. తీరు మారక పోతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
న్యాయ శాఖ ఉద్యోగాలకు 18న రాత పరీక్ష
కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈనెల 18న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్‌సైట్ www.ecourtskurnoo l.com,https://kurnool.dcourts.gov.inలో పొందుపరిచామన్నారు. ఈనెల 18న ఉదయం 9 గంటలకు కర్నూలు ప్రసూన లా కళాశాలలో రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. హాల్ టిక్కెట్లు రాకపోతే ఈనెల 17న న్యాయ సేవా సదన్ హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని తెలిపారు. ఉద్యోగ నియామక ప్రక్రియ మొత్తం రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, మెరిట్ ఆధారంగా నిర్వహిస్తామన్నారు.
కొలిమిగుండ్ల: గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ రైతు పంట పండింది. తిమ్మనాయినపేటకు చెందిన రైతు మాదాసు పెద్ద మునెయ్య రెండు ఎకరాల్లో శనగ సాగు చేయగా ఇటీవలనే పంట కోత కోయించాడు. బుధవారం శనగలు కొను గోలు చేసేందుకు వ్యాపారులు రావడంతో కాట వేయడంతో ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున రెండు ఎకరాలకు 24 క్వింటాళ్లు దిగుబడి రావడంతో సంతోషం వ్యక్తం చేశాడు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం మండలంలో సగటున ఆరేడు క్వింటాళ్ల మించి దిగుబడి వచ్చేది కాదు. తిమ్మనాయినపేటలో రికార్డు స్థాయిలో ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎకరాకు రూ.60 వేల మేర ఆదాయం లభించింది. అయితే గత రెండేళ్లుగా మార్కెట్‌లో ధర రోజురోజుకు తగ్గిపోతుండంటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధర రూ.5 వేలు మాత్రమే ఉండటంతో ఓ రకంగా రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.
పెళ్లి పెద్ద బ్రహ్మనందీశ్వరుడికి మహానంద్శీరుడి ఆహ్వానం
మహానంది/నంద్యాల(వ్యవసాయం): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే తన కల్యాణానికి పెళ్లిపెద్దగా వ్యవహరించే బ్రహ్మనందీశ్వరస్వామిని ఆహ్వానించుటకు శ్రీ కామే శ్వరి దేవి సహిత మహానందీశ్వరస్వామి బుధవారం సాయంత్రం నంద్యాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక చెరువు కట్ట వద్ద ఆలయ ఈఓ లక్ష్మీనారాయణ, వేదపండితులు పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీగణపతి దేవాలయం విడదిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా మహానంది దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకుడు రవిశంకర అవధాని మాట్లాడుతూ.. మహా నందీశ్వరుడి కల్యాణానికి బ్రహ్మనందీశ్వరస్వామిని పెళ్లి పెద్దగా ఆహ్వానించడం సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. గురువారం పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మహానంది దేవస్థానం ఈఓలు శ్రీనివాసరెడ్డి, లక్ష్మీనారాయణ, మేనేజర్లు, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు


