గొంతెండి.. రోడ్డెక్కి!
● మంచి నీటి సమస్య పరిష్కరించాలని
మహిళల ఆందోళన
● కర్నూలు – గుంటూరు రోడ్డుపై నిరసన
జూపాడుబంగ్లా: ఆ కాలనీల పక్కనే ఎంపీడీఓ కార్యాలయం. దాదాపు మూడు నెలలుగా కాలనీ ప్రజలకు నీరందడం లేదు. ‘సార్.. సమస్యను పరిష్కరించండి’ అని మొర పెట్టుకున్నా ఎవరూ ఆలకించలేదు. చివరకు గొంతెండిన ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. జూపాడుబంగ్లా పింజరిపేట, బీసీ కాలనీల ప్రజలు బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కర్నూలు – గుంటూరు రహదారిపై బైఠాయించి మంచి నీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేశారు. మంచినీటి బోరుకు మోటారు, పైపులైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూడు నెలల నుంచి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా.. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీటి కోసం పనులు మానుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గ్రామస్తుల ధర్నాతో కేజీ రోడ్డుపై వాహనాల రాకపోకలు అరగంటపాటు స్తంభించా యి. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ సంజీవ వారి వద్దకు చేరుకొని ధర్నా విరమించాలని కోరారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేవరకు కదలమని భీష్మించారు. ఎంపీడీఓ గోపికృష్ణ ధర్నా వద్దకు చేరుకుని వెంటనే ట్యాంకర్‌తో మంచినీటిని సరఫరా చేయిస్తామని హామీనిచ్చారు. మూడు రోజుల్లో గా సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందో ళన విరించారు. ఆందోళనలో సీపీఐ నాయకులు రమేష్‌బాబు, మగ్భుల్‌బాషా, తిరుపతయ్య, పుల్లయ్య, మధు, రాజు, ఉసేనయ్య, నాగమణి, లక్ష్మీదేవి, దేవమ్మ, తదితరులు పాల్గొన్నారు.


