భక్తులు సంయమనం పాటించాలి
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి కొంత అలస్యమవుతోందని, భక్తులు సంయమనం పాటించా లని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణి యా తెలిపారు. బుధవారం గంగాధర మండపం వద్ద నూతన డోనేషన్ కౌంటర్‌లో ఎస్పీ సునీల్ షెరాన్‌తో కలిసి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.భక్తుల సౌకర్యార్థం మల్లన్న స్పర్శ దర్శనం, అలంకార దర్శనం కోసం వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి 1,95,555 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోగా, అందులో 50,504 మంది శివస్వాములు ఉన్నారన్నారు. భక్తుల అనూహ్య రద్దీ కారణంగా చిన్నపాటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. బ్రహ్మోత్సవాలపై అసత్య ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రుద్రకోడు క్షేత్రానికి శివరాత్రికి బస్సులు లేవు
ఆత్మకూరు: ఈ ఏడాది మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రుద్రకోడు క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం లేదని ఆర్టీసీ డిపో మేనేజర్ వినయ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఆవరణలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. ఎస్‌ఆర్‌ఎంసీ నుంచి వెలుగోడు రిజర్వాయర్‌కు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడం వల్ల గాలేరు, రాళ్లవాగులో నీరు అధికంగా నిలిచి ఉందన్నారు. ఇప్పటికే ఫారెస్టు అధికారులతో కలిసి రుద్రకోడు క్షేత్రానికి నల్లకాల్వ నుంచి రెండు వైపులా ఉన్న రహదారులను పరిశీలించామన్నారు. ఈ రహదారుల్లో ఆర్టీసీ బస్సు వెళ్లే అవకాశం లేనందువల్ల ఈ ఏడాది రుద్రకోడుకు బస్సులను రద్దు చేసినట్లు చెప్పారు. వాస్తవానికి ప్రతి ఏడాది ఆత్మకూరు నుంచి పది ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపేవారమన్నారు.


