ఆన్‌లైన్‌లో మాత్రమే అతిశీఘ్ర దర్శనం టిక్కెట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అతిశీఘ్రదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచినట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఈఓ మాట్లాడుతూ భక్తులందరికీ స్వామివారి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లులకు, శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. అతిశీఘ్ర దర్శనం (రుసుము రూ.500) టికెట్లను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచామన్నారు. ఈ టిక్కెట్టుపై స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. శీఘ్ర దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌తో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా అందుబాటులో ఉంచామన్నారు.
కేసీ కెనాల్‌కు
1,180 క్యూసెక్కుల నీరు
పాములపాడు: ముచ్చుమర్రి , మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ 1,180 క్యూసెక్కులు కేసీ కెనాల్‌కు వస్తోందని ఏఈ శ్రీనివాసనాయక్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి 2 మోటార్ల ద్వారా 500 క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోథల పథకం నుంచి 680 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదలవుతోందన్నారు. ఈ నీటిని మండలంలోని శాంతినిలయం గ్రామ సమీపంలోని లాకీన్స్‌లా నుంచి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 34 క్యూసెక్కులు, తూడిచెర్ల సబ్‌ఛానల్‌కు 655 క్యూసెక్కుల చొప్పున దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రముఖులకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు
శ్రీశైలంటెంపుల్: మహాక్షేత్రంలో ఆదివారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. శనివారం శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు, పలువురు అధికారులు, అర్చకులు, పండితులు పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ హరిజవహర్‌లాల్, కమిషనర్ కె.రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పలువురు ప్రముఖులకు ఆహ్వానపత్రికలు అందజేశారు.
వాయిస్ క్లోనింగ్ మోసాలతో జాగ్రత్త
కర్నూలు: వాయిస్ క్లోనింగ్ ద్వారా బంధువుల గొంతుతో ఫోన్ చేసి డబ్బులు అడిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు సూచించారు. ఏఐ వాయిస్ క్లోనింగ్‌కు సంబంధించిన స్కామ్‌లు ఇటీవల చోటు చేసుకుంటున్నాయని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైతే హెల్ప్‌లైన్ నంబర్ 1930కు, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.


