సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
బనగానపల్లె రూరల్: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(యూఎస్‌ఎఫ్‌ఐ)లో వెనుకబడిన 107 మంది గ్రామ సచివాలయాల ఉద్యోగులకు షోకాజ్ నోటీసుల ఇచ్చారు. మండలంలో యూఎస్‌ఎఫ్‌ఐ సర్వే 50 శాతం కంటే తక్కువ ఉండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీఓ నాగరాజు తెలిపారు. నోటీసులు అందుకున్న వారు సర్వేలో ఎందుకు వెనుకబడ్డారో మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు.
పంట నమోదులో జిల్లాకు మూడో స్థానం
డోన్: రబీకి సంబంధించిన పంట నమోదు కార్యక్రమంలో నంద్యాల జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) వెంకటేశ్వర్లు తెలిపారు. డోన్ పట్టణంలోని ఏడీఏ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో వ్యవసాయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఏడీఏ సునీతమ్మ, ఏఓలు పాల్గొన్నారు.
మల్లన్న హుండీ ఆదాయం రూ.3.76కోట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.3,76,22,452 లభించినట్లు దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు. శుక్రవారం శ్రీశైలంలోని చంద్రవతి కల్యాణ మండపంలో చేపట్టిన హుండీల లెక్కింపులో నగదు పాటు కొంత విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు. గత 25 రోజుల్లో భక్తులు ఈ కానుకలను సమర్పించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాలో ఈ లెక్కింపు చేపట్టామన్నారు. లెక్కింపులో డీఈవో ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, శివసేవకులు పాల్గొన్నారు.
తెలుగుగంగ ప్రధాన కాలువకు గండి
బండిఆత్మకూరు: తెలుగుగంగ ప్రధాన కాలువ కు తొమ్మిదో కిలోమీటరు వద్ద ఎడమ వైపున గండిపడింది. దీంతో లింగాపురం, జీసీ పాలెం మధ్యనున్న మద్దిలేరు వాగుకు నీటి ప్రవాహం పెరిగింది. అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి నీటి ప్రవాహన్ని పూర్తిగా నిలిపి వేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత గండిని మూసివేస్తామని అధికారులు తెలిపారు. కాగా.. గండి పడిన సమయంలో కాలువలో 15 వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది.
శాస్త్రోక్తంగా పల్లకీసేవ
మహానంది: మహానందిలో శుక్రవారం రాత్రి పల్లకీ సేవ కనుల పండువగా సాగింది. కామే శ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి ఉత్సవమూర్తులను పుష్ప మాలలతో ఆలయ పండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. గణపతి పూజ అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి ఆలయ ప్రాకారాల్లో ఉత్సవం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉత్సవంలో పాల్గొని పూజలు చేశారు.
ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
నంద్యాల: పట్టణంలోని వన్‌టౌన్, ఫింగర్‌ప్రింట్ కార్యాలయాలను ఎస్పీ సునీల్‌షెరాన్ శుక్రవారం రాత్రి అకస్మికంగా తనిఖీ చేశారు. తిక్కస్వామి దర్గా ఉరుస సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు, పట్టణ ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు


