శ్రీశైలం.. ‘మహా’ శోభితం | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలం.. ‘మహా’ శోభితం

Feb 7 2026 2:40 PM | Updated on Feb 7 2026 2:40 PM

శ్రీశైలం.. ‘మహా’ శోభితం

శ్రీశైలం.. ‘మహా’ శోభితం

రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు నిర్వహణ

శ్రీశైలంటెంపుల్‌: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఆదివారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు 11రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు చేస్తారు. శ్రీభ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు ఉంటాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్టాపన, అంకురార్పణ నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు త్రిశూలపూజ, భేరిపూజ, సకలదేవతాహ్వనపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట అవిష్కరణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.

ఆర్జితసేవల నిలుపుదల

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నుంచి 18వ తేదీ వరకు ఉభయ దేవాలయంలో స్వామిఅమ్మవార్లకు జరిగే గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, చండీహోమం, రుద్రహోమం తదితర అన్ని ఆర్జితసేవలను పూర్తిగా నిలుపుదల చేశారు. భక్తులందరికి కేవలం స్వామివారి ఆలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఈ నెల 12వ తేదీ వరకు జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులకు నిర్దిష్టవేళలో మాత్రమే స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు దేవస్థాల తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పిస్తారు.

15న పాగాలంకరణ

బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 9న భృంగి, 10న హంస, 11న మయూర, 12న రావణ వాహన సేవ, 13న స్వామిఅమ్మవార్లకు పుష్పపల్లకీసేవ, 14న గజ వాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 15న ప్రభోత్సవం ఉంటుంది. అదే రోజు నందివాహనసేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. స్వామిఅమ్మవార్లకు రథోత్సవం 16న వైభవంగా జరగనుంది. బ్రహ్మోత్సవ యాగాలకు 17న పూర్ణాహుతి చేస్తారు. అశ్వ వాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలు 18న నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement