సీమ ఎత్తిపోతల పూర్తయ్యే వరకు ఉద్యమం
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
నందికొట్కూరు: రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయ్యే వరకు ఉద్యమం ఆగబోదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. నందికొట్కూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 80 శాతం పూర్తి చేసిందన్నారు. మిగతా 20 శాతం పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చేతులు కలిపి నిలిపేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం జంతువుల కొవ్వు తిరుమల లడ్డూలో వాడారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పడం దారుణమన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ సిట్ తేల్చి చెప్పినా వీరికి మంచి బుద్ధి రాలేదని విమర్శించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరకముందే జోగి రమేష్ ఇంటిపై టీడీపీ నాయకులు పెట్రోల్ బాంబు వేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి వెంట వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మార్కెట్ రాజు, శాతనకోట సర్పంచ్ జనార్దన్‌గౌడు, పార్టీ జిల్లా కార్యదర్శి ఉపేంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ కార్యదర్శి జబ్బార్, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి మాధురి, జిల్లా ప్రచార కార్యదర్శి కోకిల రమణారెడ్డి, ల్యాబ్ రవి, లడ్డు, సెమీవుల్లా, నాగరాజు తదితరులు ఉన్నారు.


