రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యేవరకు పోరాటం
‘చలో పోతిరెడ్డిపాడు’ విజయవంతం
పోరాట గళం: బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్ రెడ్డి
సాక్షి, నంద్యాల: రాయలసీమకు సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై రైతులు కదం తొక్కారు. సొంత ప్రయోజనాల కోసం సీమకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. కన్నతల్లి లాంటి పుట్టిన ప్రాంతానికి ద్రోహం చేయాల్సిన ఆలోచన ఎలా వచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమ లిఫ్ట్ పథక నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నిలిపి వేయడాన్ని నిరశిస్తూ రైతులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలివచ్చారు.
ఉత్సాహంగా..
రాయలసీమకు సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై వైఎస్సార్‌సీపీ కన్నెర్ర చేసింది. తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మకై ్క సీమ రైతులకు, ప్రజలకు అన్యాయం చేస్తే అడ్డుకుని తీరతామని ప్రతినబూనింది. చంద్రబాబు చేస్తున్న ప్రజాకంఠక పాలనను వివరించేందుకు చలో పోతిరెడ్డిపాడు సభకు పిలుపునిచ్చింది. ఒక్క పిలుపుతో రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ప్రజలు ఉత్సాహంగా ఉరకలేస్తూ భారీగా తరలివచ్చారు. ట్రాక్టర్లు, ఆటోలు ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా తరలివచ్చారు. తమ ప్రాంతానికి అన్యాయం చేయాలని చూస్తే రాజకీయ సమాధి కడతామని హెచ్చరించారు.
ఇది ఆరంభం మాత్రమే..
పోతిరెడ్డిపాడు సభ ఆరంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమ లిఫ్ట్ పనులను ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. పనులు ప్రారంభించకుంటే రాజకీయంగా సమాధి కడతామని హెచ్చరించారు. చంద్రబాబుకు చేతకాకుంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు.
వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించి..
సభ ప్రారంభానికి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని సందర్శించారు. అక్కడ ఆగిపోయిన పనులను పరిశీలించి, ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోతులపాడు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ముందుగా దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చివరి వరకు అనుమతి
ఇవ్వకుండా తాత్సారం
చలో పోతిరెడ్డిపాడు సభను విజయవంతం కాకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకుండా తాత్సారం చేసింది. వైఎస్సార్‌సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేవలం రెండు గంటల పాటే నిర్వహించాలని నిబంధన విధించారు. కేవలం ఒక రోజు ముందు అనుమతి ఇవ్వడంతో సభకు రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాలేరని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ, ప్రభుత్వ పెద్దలు అవాక్కయ్యేలా సభ సాగింది. ఉదయం నుంచే గ్రేటర్ రాయలసీమ జిల్లాల నుంచి రైతులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
పది వేలకు పైగా వచ్చిన జనం
సమయం లేకపోవడంతో కేవలం నాలుగు వేల మంది కూర్చునే సామర్థ్యంతో సభ ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకే కుర్చీలు మొత్తం ఫుల్ అయ్యాయి. సభకు అటు ఇటు దాదాపు ఐదు వేల మంది నిల్చొని తమ అభిమాన నాయకుల ప్రసంగాలను వీక్షించారు. దాదాపు మూడు గంటల పాటు సభ సాగింది. సభ పూర్తయ్యే వరకు ప్రజలు, రైతులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ తమ మద్దతును ప్రకటించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌తో పాటు రాయలసీమ లిఫ్ట్ పథకానికి చంద్రబాబు ఎలా దగా చేశారో నేతలు వివరించారు. సీమ అంటేనే చంద్రబాబుకు గిట్టదని.. తన రాజకీయ జీవితంలో ఏనాడూ సీమ అభివృద్ధిని, రైతుల కష్టాలను పట్టించుకున్న పాపానపోలేదని తెలిపారు. సీమ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ తన హయాంలోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్ద పీట వేశారని గణాంకాలతో వివరించారు. వైఎస్సార్ సీపీ నేతల ప్రసంగాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సభ నామమాత్రంగా సాగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు మొదట భావించాయి. కానీ, సభ ప్రారంభమయ్యే సమయానికి వారి అంచనాలు తలకిందులయ్యాయి. సభకు ప్రజలు పోటెత్తారు. సుమారు పది వేల మందికి పైగా జనాలు తరలివచ్చి తమ మద్దతు తెలియజేశారు.
దారులన్నీ పోతులపాడు వైపే...
చలో పోతిరెడ్డి పాడు కార్యక్రమానికి గ్రేటర్ రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు వాహనాలలో తరలివచ్చారు. ఉదయం 10 గంటలకే ప్రాంతమంతా వాహనాలతో కిక్కిరిసిపోయింది. కర్నూలు – ఆత్మకూరు హైవే నుంచి పోతులపాడు గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో నాయకులు, ప్రజలు హైవే నుంచి నడుచుకుంటూ వచ్చారు. రైతులు పొలం గట్ల వెంబడి అడుగులో అడుగు వేసుకుంటూ సభాస్థలికి చేరుకున్నారు.
వైఎస్సార్‌సీపీ జెండాతో సభకు వచ్చిన అభిమాని
పులి కథతో ఆకట్టుకున్న బైరెడ్డి
సభలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడిన మాటలు ఆకట్టుకోవడంతో పాటు అందరినీ ఆలోచింపజేశాయి. చిన్నపాటి కథతో చంద్రబాబు నైజాన్ని కళ్లకు కట్టినట్లు తెలిపారు. ఒక వేటగాడు పులితో భయంకరంగా ఫైట్ చేసి చంపేసిన తర్వాత తనకు గాయాలు కావడంతో మందు తెచ్చుకోవడానికి వెళితే.. ఈ లోపు చంద్రబాబు లాంటోడు వచ్చి.. పులి గోళ్లు.. పళ్లు ఎత్తుకెళ్లి .. పులిని నేనే చంపాను అంటూ ఊరంతా టాం... టాం.. వేసుకున్నట్లు... చంద్రబాబు తీరు కూడా అంతేనని చెప్పడంతో సభ మొత్తం ఈలలు, చప్పట్లతో మార్మోగింది.
ఫ్లెక్సీల ప్రదర్శన
సభకు వచ్చిన యువకులు సీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని వివరించేలా ఫ్లెక్సీలు చేతిలో పట్టుకుని ప్రదర్శించారు. ‘రాయలసీమ ద్రోహి.. తెలంగాణ పక్షపాతి.. చంద్రబాబు డౌన్ .. డౌన్’ అంటూ రాసిన ప్లెక్సీలను ప్రదర్శించడంతో పాటు భారీ ఎత్తున నినాదాలు చేశారు.
కదంతొక్కిన రాయలసీమ రైతులు
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై
మండిపాటు
తక్కువ సమయం ఉన్నా
భారీగా తరలివచ్చిన కర్షకులు
రాయలసీమ లిఫ్ట్ పనులను
ప్రారంభించాలని వైఎస్సార్‌సీపీ
ముఖ్య నేతల డిమాండ్
లేదంటే చంద్రబాబుకు
రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిక
రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యేవరకు పోరాటం
రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యేవరకు పోరాటం
రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యేవరకు పోరాటం
రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యేవరకు పోరాటం


