ఏసీబీ వలలో మున్సిపల్‌ కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో మున్సిపల్‌ కమిషనర్‌

Feb 6 2026 7:27 AM | Updated on Feb 6 2026 7:27 AM

ఏసీబీ

ఏసీబీ వలలో మున్సిపల్‌ కమిషనర్‌

రూ.20 వేలు లంచం తీసుకుంటూ

దొరికిన వైనం

ఆత్మకూరురూరల్‌: లంచం తీసుకుంటూ ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు గురువారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ నేరంలో పాలు పంచుకున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి భాస్కర్‌ ను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆత్మకూరు పట్టణం కొత్తపేట కు చెందిన నాయబ్‌ సయ్యద్‌ సజ్జద్‌ అలి అనే వ్యక్తి తనకు చెందిన ఖాళీ స్థలంలో ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం చేయాలని తలపెట్టాడు. అందుకోసం తన స్థలానికి వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌(విఎల్‌టీ) కట్టి రశీదు తీసుకోవాలని భావించాడు. అందుకోసం పలుమార్లు ఆఫీస్‌ చుట్టు తిరిగి వేసారి కమిషనర్‌ రమేష్‌ బాబుకు అనుకూలమైన సిబ్బంది చెప్పడంతో లంచం లేనిదే పని జరగదని తెలుసుకున్నాడు. అలాగే ఇస్తానని కూడా అంగీకరించడంతో 20 వేల రూపాయలకు బేరం కుదిరింది. ఈ అంశాన్ని సజ్జద్‌ అలి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి సూచనల మేరకు గురువారం లంచం సొమ్మును మున్సిపల్‌ కమిషనర్‌ రూంలోనే ఆయన సమక్షంలోనే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి భాస్కర్‌ చేతికి అందించాడు. అదే సమయానికి అక్కడకు చేరుకున్న ఏసీబీ డీఎస్పీ సోమన్న , సీఐ బత్తల కృష్ణయ్య, ఇతర పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ బాబును, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి భాస్కర్‌ ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

మహాశివరాత్రికి

ప్రత్యేక బస్సులు

నంద్యాల (వ్యవసాయం): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ రజియా సుల్తానా గురువారం తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదన్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం బస్సుల్లో ఫోన్‌ పే ద్వారా చెల్లింపులు సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందన్నారు. గతేడాది నంద్యాల నుంచి శ్రీశైలానికి 160 బస్సులు ఏర్పాటు చేయగా, ఈ ఏడాది 200 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సులను ఇతర జిల్లాల నుంచి తీసుకొస్తున్నామన్నారు. వీటితో పాటు 80 బస్సులను ఇతర శైవ క్షేత్రలకు నడుపుతున్నట్లు చెప్పారు. బస్సుల మరమ్మతులకు శ్రీశైలం, శిఖరం, దోర్నాల, పాయింట్‌ ప్రదేశాలలో రిలీఫ్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్గమధ్యంలో ఏదైనా బస్సులకు ఇబ్బందులు తలెత్తే వెంటనే మొబైల్‌ రిలీఫ్‌ సిబ్బంది వచ్చి వాటి మరమ్మతులు చేస్తారన్నారు.

అన్నదానాలు ప్రారంభమైన వెంటనే పాదయాత్రకు అనుమతి

ఆత్మకూరు డీఎఫ్‌ఓ విఘ్నేష్‌

ఆత్మకూరు: నల్లమల అటవీ పరిధిలో అన్నదానాలు ప్రారంభమైన వెంటనే భక్తుల పాదయాత్రకు అనుమతి ఇస్తామని ఆత్మకూరు డీఎఫ్‌ఓ విఘ్నేష్‌ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని డీఎఫ్‌ఓ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. పులుల గణన కారణంగా ఈనెల 8వ తేదీ నుంచి పాదయాత్రకు అనుమతించామన్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాదయాత్రకు 8వ తేదీ కంటే ముందుగానే అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నల్లమల అటవీ పరిధిలోని నాగలూటి, పెచ్చెరువు, భీమునికొలను ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన వెంటనే పాదయాత్రకు అనుమతిస్తామన్నారు. అన్నదానం లేకపోతే పాదయాత్రగా వెళ్లే భక్తులు ఆకలితో ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. శనివారం నుంచి అటవీశాఖ సిబ్బంది ద్వారా భక్తులను సురక్షితంగా శ్రీశైలం క్షేత్రానికి పంపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

నాగలూటిలో 7 నుంచి అన్నదానం

నాగలూటిలో ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తాము అన్ని వంట సామగ్రితో ఉన్నామన్నారు. పాదయాత్ర భక్తులు ఇబ్బందులు నిరంతరం అన్నదానం చేస్తామన్నారు. వెంకటాపురంలో ఈనెల 8వ తేదీ నుంచి అన్నదానం నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్పారు.

ఏసీబీ వలలో మున్సిపల్‌ కమిషనర్‌ 1
1/1

ఏసీబీ వలలో మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement