పొలాల్లో దొంగలు పడ్డారు!
● మాయమవుతున్న బోరు మోటర్లు, విద్యుత్ తీగలు
● వారంలో 35 మోటర్లు అపహరణ
● లబోదిబోమంటున్న రైతులు
రుద్రవరం: ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరో వైపు చీడపీడలు వీటి నుంచి పంటను కాపాడుకోలేక సతమవుతున్న రైతులకు కొత్తగా దొంగల బెడద వేధిస్తోంది. రాత్రికి రాత్రి పొలాల్లో విద్యుత్ బోరు మోటర్లు, తీగలు అపహరణకు గురవుతున్నాయి. కోటకొండ గ్రామ చుట్టు పక్కల పలువురు రైతులకు చెందిన మోటార్లు చోరీకి గురయ్యాయి. తెలుగుగంగ ఆయకట్టు రైతులు అధిక శాతం బోర్లు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే రబీకి పొలాలు సిద్ధం చేశారు. రాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా పొలాల్లోకి వెళ్లి కనిపించిన వ్యవసాయ బోరుమోటర్ల వద్దకు వెళ్లి కేబుల్ తీగలను దొంగలిస్తున్నారు. అలాగే భూమి అంతర్భాగంలో కాకుండా భూమిపైనే ఉన్న బోరు మోటర్లను తస్కరిస్తున్నారు. ఉదయాన్నే పంటకు నీరు పారించుకునేందుకై పొలాల వద్దకు వెళ్లిన రైతులు అక్కడ కేబుల్ తీగలు, బోరు మోటర్ల మాయం అవ్వడంతో అవాక్కవుతున్నారు. వారం రోజుల నుంచికోటకొండ గ్రామంలో ఈ దొంగతనాలు అధికమయ్యాయి. ఈ విషయంపై గ్రామానికి చెందిన పులువురు రైతులు రుద్రవరం ఎస్‌ఐ మహ్మద్‌రఫికి ఫిర్యాదు చేశారు. ఖరీఫ్‌లో మొక్కజొన్న వేయగా, భారీ వర్షాలకు పంట మొత్తం దెబ్బతిని నష్టపోయామని, ఈ క్రమంలో రబీకి సిద్ధమవుతుంగా బోర్ల మోటార్లు చోరీ కంటి మీద నిద్ర కరువు చేస్తున్నాయని వాపోతున్నారు. వారం రోజుల్లోనే తమ గ్రామ పరిధిలో 35 బోరు మోటర్ల విద్యుత్ కేబుల్ తీగలు, రెండు బోరు మోటర్లు దొంగతనానికి గురయ్యాయన్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగల ఆట కట్టించాలని రైతులు కోరుతున్నారు.
పొలాల్లో దొంగలు పడ్డారు!


