ఎస్సీల ఇంటి బేస్‌మెట్లు నేలమట్టం
● అర్ధరాత్రి జేసీబీతో ధ్వంసం
కొలిమిగుండ్ల: మండల కేంద్రంలో స్థానిక కస్తూర్బా పాఠశాలకు ఎదురుగా ఉన్న జగనన్న కాలనీ చెంతనే ఎస్సీలు ఇళ్ల నిర్మాణాల కోసం నిర్మించుకున్న బేస్‌మెట్లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి జేసీబీ సాయంతో నేల మట్టం చేశారు. ఇటిక్యాల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 112/ఏలోని భూమిని 763/1గా సబ్ డివిజన్ చేసి ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్ వేశారు. 70 మంది లబ్ధిదారులకు ఎండార్స్‌మెంట్ ఇవ్వడంతో 2024లో బేస్‌మెట్లు నిర్మించుకున్నారు. ఈ స్థలంలో ఒక్కొక్కరు రూ.70 వేలు నుంచి లక్ష రూపాయలకు పైగానే బేస్‌మెట్ల నిర్మాణం కోసం ఖర్చు చేసుకున్నారు. కూలీ పనులకు వెళ్లి దాచుకున్న సొమ్ముతో కట్టించుకున్నామని రాత్రికి రాత్రే పడగొట్టారని లబ్ధిదారులు వాపోయారు. అధికారికంగా పట్టాలు ఇవ్వక పోయినా పలు సార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎండార్స్‌మెంట్ ఇవ్వడంతో నిర్మాణాలు చేసుకున్నామన్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. తమ స్థలాలను లాక్కునేందుకు ఈకుట్ర పన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేస్‌మెట్ల కోసం పెట్టిన ఖర్చు నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలపైనే కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. నిర్మాణాలు తొలగించడంతో లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం చేరుకొని తహసీల్దార్ శ్రీనివాసులును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు.


