పకడ్బందీగా పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌

Nov 7 2025 6:45 AM | Updated on Nov 7 2025 6:45 AM

పకడ్బందీగా పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌

పకడ్బందీగా పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల: జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఈఆర్‌ఓ, ఎఈఆర్‌ఓలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 1,629 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో ఐదు కేంద్రాల పేర్లను మార్చామన్నారు. మొత్తం 36 పోలింగ్‌ కేంద్రాల మార్పుకు ప్రతిపాదనలు అందాయని, వీటిలో ఆళ్లగడ్డ–9, శ్రీశైలం–6, నంద్యాల–13, బనగానపల్లె–1, డోన్‌–7 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.నూతనంగా 113 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయని, వీటిలో ఆళ్లగడ్డ–13, శ్రీశైలం–8, నంద్యాల–48, బనగానపల్లె–29, డోన్‌–5, నందికొట్కూరు–10 కేంద్రాలు ఉన్నాయన్నారు. కొత్త కేంద్రాలు ఏర్పాటయ్యాక జిల్లాలో 1,742 పోలింగ్‌ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయన్నారు.

నిబంధనలు పాటించాలి..

కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు సమయంలో ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు కేంద్రాల్లో ఉండకుండా, అందరూ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల భవనాల్లో నూతన పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయకూడదన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులతో అనుబంధం ఉన్న ప్రైవేటు స్థలాలను ఉపయోగించరాదని స్పష్టం చేశారు. పీఆర్‌పీ యాక్ట్‌ 1950, సెక్షన్‌ 13(బి) ప్రకారం బీఎల్‌ఓలను ఎంపిక చేశామని, వారు సరైన రీతిలో విధులు నిర్వర్తించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఓటర్ల జాబితాలో నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలను ఎన్నికల నిబంధనల మేరకు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఎన్నికల విభాగానికి సంబంధించిన ఆపరేటర్‌ పోస్టుల భర్తీని త్వరితగతిన పూర్తి చేసే చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ రాము నాయక్‌, ఆర్డీఓలు విశ్వనాథ్‌, నరసింహులు, శివనాగజ్యోతి, రాజకీయ పార్టీ ప్రతినిధులు కాంగ్రెస్‌ పార్టీ సయ్యద్‌ రియాజ్‌ బాషా, వైఎస్సార్సీపీ సాయిరాం రెడ్డి, టీడీపీ ప్రసాద్‌ రెడ్డి, శివరాం రెడ్డి, బీజేపీ చంద్రశేఖర్‌, సీపీఐ నరసింహులు, బహుజన సమాజ్‌ పార్టీ శ్రీనివాసులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ అభ్యంతరాలు..

ఆళ్లగడ్డలో ఉన్న ఒక పోలింగ్‌ కేంద్రం స్థానిక శాసనసభ్యుని ఇంటి సమీపంలో ఉందని, దానిని మార్పు చేయాలని రాజకీయ పార్టీ ప్రతినిధులు కోరారు.

పాండురంగాపురం–బాపూజీ నగర్‌ ప్రాంతంలో సుమారు 1200 మంది ఓటర్లు ఉన్నందున అక్కడ ప్రత్యేక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.

పోలింగ్‌ కేంద్రాల ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాలు వేర్వేరుగా ఉండేలా చూడాలని సూచించారు.

రాబోయే ఎన్నికల సమయంలో గర్భిణులకు హోమ్‌ ఓటింగ్‌ సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement