 
															భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
● ఉల్లి, మొక్కజొన్న, టమాట పంట కోత
వాయిదా వేసుకోవాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ‘మొంథా’తుపాను ప్రభావంతో మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరినీ అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో తుపాన్ ప్రభావ భద్రతా చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొంథా తుపా ను కాకినాడ – విశాఖపట్నం మధ్య తీరం దాటనుందని, దాని ప్రభావం నంద్యాల జిల్లాపైనా ఉండే అవకాశముందని అన్నారు. తుపాను ప్రభావం నేపథ్యంలో జిల్లాలోని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. ముఖ్యంగా ఉల్లి, మొక్కజొన్న, టమాట రైతులు పంట కోతను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 30 శాతం మొక్కజొన్న కోత జరగగా, అధిక తేమ కారణంగా పంటలకు తక్కువ ధరలు పడే అవకాశం ఉందన్నారు. పంట కోత వాయిదా ప్రాముఖ్యతపై అధి కారులు అవగాహన కల్పించాలన్నారు. మట్టి మిద్దెల్లో నివసించే ప్రజలకు నోటీసులు జారీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చెరువుల వద్ద గండి పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఇసుక సంచులు, అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని, అధిక వర్షపాతం నమోదైతే వెంటనే ప్రత్యామ్నా య చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఆధార్ అప్‌డేట్ స్పెషల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డీఆర్‌ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
