 
															కోటి సంతకాలతో ప్రజల్లో చైతన్యం
● వైద్య కళాశాలల ప్రైవేటీకరణను
అడ్డుకుంటాం
● మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి,
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
బొమ్మలసత్రం: ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తెచ్చిందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక గాంధీచౌక్ సెంటర్‌లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషాతో పాటు స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ పీపీ నాగిరెడ్డి, కౌన్సిల్ మెంబర్ గోపవరం సాయినాథరెడ్డి, రాష్ట్ర సెక్రటరీ దేశం సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీచౌక్‌లోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి వారు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శిల్పా మాట్లాడుతూ.. పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 5 కళాశాలలు ప్రారంభమై అందులో పేద విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వివరించారు. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య విద్య అందటం ఇష్టంలేని కూటమి నేతలు తమ స్వలాభం కోసం ప్రైవేటీకరణ పేరుతో కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విద్యతో పాటు ఆయా ప్రాంతాల పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే మెడికల్ కళాశాలలతో కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. పీపీపీ విధానం కొనసాగితే రాష్ట్రంలో పేదలకు వైద్య విద్య దూరమవుతుందనే విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అందరూ ముందుకు రావాలన్నారు.
కూటమి నేతలు రాక్షాసానందం
పేదలకు మంచి జరగాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రతి పనిని నీరుగారుస్తూ కూటమి నేతలు రాక్షాసానందం పొందుతున్నారని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా విమర్శించారు. వైద్య విద్యను పేదలకు దూరం చేస్తే ప్రజలు సహించరని కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దాల్‌మిల్ అమీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, రాష్ట్ర మహి ళా విభాగం జనరల్ సెక్రెటరీ శశికళారెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డి, మేధావుల సంఘం అధ్యక్షులు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి, అనిల్ అమృతరాజ్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు కారు రవికుమార్, సెక్రటరీ దేవనగర్‌బాషా, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు రమణ, అసెంబ్లీ గ్రీవెన్స్ అధ్యక్షులు వివేకానందరెడ్డి, లీగల్‌సెల్ అధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి, యూత్ అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
