 
															వీఓఏలను అన్యాయంగా తొలగిస్తే ఉద్యమిస్తాం
● 5వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి కె.ధనలక్ష్మి
నంద్యాల(న్యూటౌన్): వీఓఏలను అన్యాయంగా తొలగిస్తే ఉద్యమిస్తామని వీఏఓల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి హెచ్చరించారు. సోమవారం నంద్యాల పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్‌లో వీఓఏల ఉద్యోగుల సంఘం ఐదవ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వీఓఏలపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేధింపులు పెరిగిపోతున్నాయన్నారు. కూటమి నేతలు వీఓఏలను అన్యా యంగా తొలగిస్తున్నారని, గ్రామ ఐక్య సంఘాల తీర్మానం లేకుండా తొలగిస్తే ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వీఓఏలకు 25 ఏళ్లుగా వేత నాలు పెంచకపోవడం దారుణమన్నారు. వేతనాలు పెంచాలని అడిగితే ప్రభుత్వ ఉద్యోగులు కాదని, ప్రభుత్వం దాటవేస్తుందన్నారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ వైపు తీసుకొని వెళ్తుందన్నారు. స్కీం వర్కర్లపై కూటమి నాయకులు కత్తి పెట్టారని, తొలగింపులే ప్రధాన అజెండాగా పెట్టుకొని తొలగించడం అన్యాయమన్నారు. మహాసభల్లో ముందుగా మహిళా సమాఖ్య సీనియర్ నాయకులు నిర్మలమ్మ, వీఏఓల సంఘం నాయకులు రూపాదేవి, కృష్ణమ్మ, శ్రీదేవి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, వీఓఏల సంఘం జిల్లా కార్యదర్శి మిట్నాల తిరుపతయ్య, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
