అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ సునీల్‌షెరాన్
ఆత్మకూరు: నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురిసినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్‌షెరాన్ పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు అలుగు ప్రాంతాన్ని, పట్టణంలో పీదిరివాగు, భవనాశి, పెద్దవాగులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే కురుకుంద, వడ్లరామాపురం, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, వరద ఉధృతితో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటే గ్రామంలోని వీఆర్వో, పోలీసులను సంప్రదిస్తే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారన్నారు. సిద్ధాపురం చెరువు నిండి అలుగు ప్రవహించడంతో శ్రీశైలంకు వెళ్లే అన్ని వాహనాలను, దోర్నాల వైపు వెళ్లే అన్ని వాహనాలను నిలిపివేశారన్నారు. విజయవాడకు నంద్యాల మీదుగానే వెళ్లాలన్నారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీస్ సిబ్బందితో చర్చించారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, సీఐలు రాము, సురేష్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ నాగమణి పాల్గొన్నారు.


