లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం
ఆత్మకూరు: శ్రీశైలం నియోజకవర్గంలో అతి భారీ వర్షాలు కురవడంతో జన జీవనం స్తంభించిపోయింది. పలు కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి బియ్యం, కందిపప్పుతోపాటు నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. వాగులు పొంగిపొర్లడంతో మొత్తం 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలన్నీ జలమయం అయ్యి కోట్ల రూపాయలు విలువ చేసే పంట మట్టిపాలైంది. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 8 వేల ఎకరాలకు పైగా వరి పంటలు ధ్వంసమయ్యాయి.
శ్రీశైలం: తుపాన్ కారణంగా శ్రీశైలానికి చేరుకునే వాహనాలను మున్ననూరు, దోర్నాల చెక్‌పోస్టుల వద్ద మంగళవారం రాత్రి నుంచి నిలుపుదల చేశారు. శ్రీశైల మహా క్షేత్రంలో అమ్మవారి ఆలయం వెనుక ఉన్న ఏనుగుల చెరువు నిండిపోయి ఆలయ ప్రాకార దక్షిణ మాడ వీధిలో వరదలా ప్రవహించింది. పాతాళగంగ రోప్‌వే నుంచి ఘాట్ల వరకు ఉన్న రోడ్డు మార్గంలో కొండ రాళ్లు విరిగిపడటంతో తాత్కాలికంగా వేసుకున్న షాపులు కూలిపోయాయి.


