
ఉద్యాన పథకాలను పకడ్బందీగా అమలు చేస్తాం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఉద్యాన పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా ఉద్యాన అధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న పి.రామాంజనేయులు పదోన్నతిపై చిత్తూరు జిల్లా ఆత్మ డీపీడీగా బదిలీ అయ్యారు. ఈ స్థానంలో అనంతపురం నగరపాలక సంస్థలో ఉద్యాన శాఖ ఏడీగా పనిచేస్తున్న రాజాకృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈయన ఏపీఎంఐపీ అదనపు పీడీగా ఈ ఏడాది జూన్ 12వ తేదీ వరకు పనిచేశారు. తాజాగా జిల్లా ఉద్యాన అధికారిగా నియమితుల్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని, పండ్లతోటల అభివృద్ధికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతామన్నారు. ఆయిల్‌పామ్ సాగులో పురోగతికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(సెంట్రల్): సంగీత వాయిద్య కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నారని, ఇందు కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టు ద్వారా ఇంటి నంబర్ 4–25–5, బాలాజీనగర్, కర్నూలు–518006 అనే చిరునామాకు అక్టోబర్ 10వ తదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఒక్క రూంలో ఆరుగురు ఎలా ఉంటారు?
● వీసీని కలసిన ఆర్‌యూ ఇంజినీరింగ్
కళాశాల విద్యార్థులు
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయని, ఒక్క రూంలో ఆరుగురు ఎలా ఉంటారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు 30 మంది బుధవారం వీసీ వి.వెంకట బసవరావు, రిజిస్ట్రార్ బి. విజయ్‌కుమార్ నాయుడును కలిశారు. హాస్టళ్లలో మెనూ సరిగా పాటించడం లేదని, రూంలలో విద్యుత్ స్విచ్ బోర్డులు, విద్యుత్ తీగలు సరిగా లేవని చెప్పారు. హాస్టల్ కమిటీ సమావేశమై విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని వీసీ, రిజిస్ట్రార్ విద్యార్థులకు హామీ ఇచ్చారు.