
హిట్ అండ్ రన్ కేసులను త్వరితగతిన పరిష్కరించండి
కర్నూలు: ఉమ్మడి జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. స్థానిక న్యాయ సేవాసదన్‌లో హిట్ అండ్ రన్ కేసులపై బుధవారం జిల్లాస్థాయి అధికారులతో మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 76 హిట్ అండ్ రన్ కేసులకు గాను 21 కేసుల్లో నష్టపరిహారం (అవార్డు) మంజూరైందని అధికారులు తెలిపారు. అలాగే నంద్యాల జిల్లాలో 37 హిట్ అండ్ రన్ కేసులకు గాను 11 కేసుల్లో నష్టపరిహారం మంజూరైందన్నారు. మిగతా వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని లీలా వెంకటశేషాద్రి అధికారులను ఆదేశించారు. కర్నూలు, నంద్యాల డీఆర్వోలు వెంకటనారాయణమ్మ, రాము నాయక్, ఆర్‌టీఓలు భరత్ చవాన్, శివారెడ్డి, డీటీఆర్‌బీ సీఐలు ఆదిలక్ష్మి, మల్లికార్జున, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ సంధ్యారెడ్డి, డీసీఆర్‌బీ ఎస్‌ఐ శ్రీనివాసరావు, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం తదితరులు పాల్గొన్నారు.