
ముస్లింలకు అండగా వైఎస్సార్‌సీపీ
● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
బొమ్మలసత్రం: ముస్లింలకు ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీమ్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మాబున్నిసా, మైనారిటీ నాయకులతో కలసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్‌సభ, రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు వ్యతిరేకించారన్నారు. అయితే ఎన్‌డీఏ ప్రభుత్వ మెజారిటీ కారణంగా ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిందన్నారు. ఎన్‌డీఏలో భాగస్వామ్యులైన టీడీపీ, జనసేన, బీజేపీలు బిల్లుకు మద్దతు తెలపటం బాధాకరమన్నారు. సుప్రీమ్ కోర్టు వక్ఫ్‌బోర్డు సవరణ చట్టంపై జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల విషయంలో సీఎం చంద్రబాబు చేసిన వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు జోక్యం వల్లే ఈ ఉత్తర్వులు సాధ్యమయ్యాయని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. ముస్లింను మభ్య పెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. గతంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి ఇప్పుడు ముస్లింలకు మేలు చేస్తున్నట్లుగా మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ముస్లింలను మోసం చేసే ఈ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించబోవని, వారి అబద్ధపు మాటలను ప్రజలను విశ్వసించబోరన్నారు. ముస్లింల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతోందన్నారు.