
ఆరుతడి.. సాగు తడబడి..!
జిల్లాలో ఆరుతడి పంటల సాగు వివరాలు (హెక్టార్లలో)..
విస్తీర్ణం విస్తీర్ణం
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రెండు ఎకరాల్లో మొక్కజొన్న, మూడు ఎకరాల్లో జొన్న, ఒకటిన్నర ఎకరాల్లో మిరప సాగు చేశాను. గత ఏడాది మిరప సాగుతో తీవ్ర నష్టం రావడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గించి ఆరుతడి పంట అయిన జొన్న సాగు చేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 10 వేల వరకు వెచ్చించాను.
– కుళాయప్ప, రైతు, అమడాల,
కోవెలకుంట్ల మండలం
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఏడు ఎకరాల్లో పెసర పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర రూపంలో ఎకరాక రూ. 6 వేలు వెచ్చించాను. పంట చేతికందే తరుణంలో గత నెలలో కురిసిన భారీ వర్షాలతకు తెగుళ్లు ఆశించి పైరు పూర్తిగా దె బ్బతినడంతో తొలగించాను. పెసరతోపాటు ఐదు ఎకరాల్లో కంది, మరో పది ఎకరాల్లో వరి సాగు చేశాను. – వెంకటేశ్వరరెడ్డి, రైతు, కంపమల్ల,
కోవెలకుంట్ల మండలం
కోవెలకుంట్ల: రెండేళ్లుగా జిల్లా రైతులకు ఆరుతడి పంటల సాగు కలసి రావడం లేదు. గతంలో సాధారణ విస్తీర్ణం మించి సాగయ్యేది. గత ఖరీఫ్ నుంచి ఆరుతడి పంటల సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. మరో పదిహేను రోజుల్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగియనుంది. సీజన్ మొదట్లో వర్షాభావం, విత్తనం వేసేనాటికి అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జిల్లాలో ఆరుతడి పంటల సాగు చతికిలబడింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,10,913 హెక్టార్లలో వివిధ పంటల సాగు సాధారణ విస్తీర్ణంగా కాగా ఆయా మండలాల్లో ఇప్పటి వరకు 1,91, 300 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేయగలిగారు. ఇందులో 88,205 హెక్టార్లలో ఆరుతడి పంటలు సాగు కావాల్సి ఉండగా 65 వేల హెక్టార్లలో మాత్రమే సాగు అయ్యాయి. గత నెల 15 నాటికే ప్రధాన ఆరుతడి పంటలైన వేరుశనగ, పత్తి, పెసర, సోయాబీన్, పొద్దుతిరుగుడు, తదితర పంటల సాగుకు అదును ముగిసింది. ఎర్రరేగడి నేలల్లో మాత్రం కంది, ఆముదం, అలసంద, తదితర పంటలు సాగు చేసుకునే ఆస్కారం ఉంది.
భారీగా తగ్గిన పత్తి, వేరుశనగ విస్తీర్ణం..
ప్రధాన ఆరుతడి పంటలుగా పేరుగాంచిన పత్తి, వేరుశనగ సాగు విస్తీర్ణం ఈ ఏడాది జిల్లాలో భారీగా తగ్గింది. ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభభమైన నాటి నుంచే ఈ పంటలు సాగు చేసేవారు. ఈ ఏడాది సీజన్‌కు ముందు మే నెలలో విస్తారంగా వర్షాలు కురిసినా జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో సాగు కనిష్ట స్థాయికి పడిపోయింది. కూటమి ప్రభుత్వం సకాలంలో వేరుశనగ విత్తనాలను రైతులకు సరఫరా చేయకపోవడంతో సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 11,943 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా 7,331 హెక్టార్లలో సాగు చేయగలిగారు. అలాగే 18,827 హెక్టార్లలో ముంగారి, హైబ్రీడ్, డబుల్‌ఫోర్, క్రాసింగ్, తదితర పత్తి రకాల సాగు చేయాల్సి ఉండగా సాగు కేవలం 5,419 హెక్టార్లలకు మాత్రమే పడిపోయింది. మినుము సాధారణ విస్తీర్ణాన్ని మించి సాగు అయినా పంట కోత, నూర్పిడి సమయంలో కురిసిన భారీ వర్షాలతో పంట దెబ్బతిని రైతులకు నష్టం వాటిల్లింది. ఆముదం, పెసర, పొద్దుతిరుగుడు, తదితర పంటల సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
సీజన్ మధ్యలో దెబ్బతీసిన భారీ వర్షాలు
సాధారణంగా ఖరీఫ్‌లో జూన్, జూలై నెలల్లో వేరుశనగ, కంది, మినుము, సోయాబీన్, పత్తి, తదితర పంటల సాగు చేసేందుకు సరైన అదును. జూన్, జులై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఆగస్టు 15 లోపు ఆయా పంటలు సాగు చేసుకోవచ్చుకుంటే ఆగస్టు నెలలో భారీ వర్షాలు రైతులను వెంటాడాయి. ఆ నెలలో వరుసగా కురిసిన వర్షాలతో పంటల సాగుకు ఆటంకం కలిగింది. పొలాల్లో తేమ ఆరకపోవడం, సాగుకు గడువు ముగియడంతో ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఖరీఫ్ చివరి పంటగా జొన్న సాగుకు సరైన అదును కాగా నాలుగు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జొన్న సాగు ముందుకు సాగడం లేదు. సెప్టెంబర్ నెలలో సైతం వర్షాలు వెంటాడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట సాధారణ సాగైన
పత్తి 18,827 5,419
వేరుశనగ 11,943 7,331
జొన్న 872 104
పొద్దుతిరుగుడు 389 35
పెసర 279 40
కొర్ర 1,855 1,202
కంది 36,243 34,112
మినుము 9,700 10,484
ఆముదం 2,921 1,882
సోయాబీన్ 4,176 4,600
ఖరీఫ్‌లో ఆరుతడి పంటల సాగు
అంతంత మాత్రమే
ఈ ఏడాది భారీగా తగ్గిన
పత్తి సాగు విస్తీర్ణం
జిల్లాలో 5,419 హెక్టార్లకే పరిమితం
పడిపోయిన వేరుశనగ, ఆముదం,
పొద్దుతిరుగుడు పంటల సాగు
పంట చేతికందే తరుణంలో
మినుము రైతుకు నష్టం

ఆరుతడి.. సాగు తడబడి..!

ఆరుతడి.. సాగు తడబడి..!

ఆరుతడి.. సాగు తడబడి..!