
విద్యుత్ ఉద్యోగుల ఉద్యమ బాట
● నేటి నుంచి ఆందోళన కార్యక్రమాలు
● జేఏసీగా మారిన 23 సంఘాలు
కర్నూలు(అగ్రికల్చర్): తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టనున్నారు. ఈ నెల 15 నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను ఏపీ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సిద్ధం చేసింది. జేఏసీలో 1104, 327, డిప్లొమా ఇంజినీర్స్, బీసీ, ఓసీ, బహుజన ఉద్యోగ సంఘాలు మొత్తంగా 23 ఉన్నాయి. ఈ నెల 15 నుంచి చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై జేఏసీ ప్రతినిధులు ఈ నెల 6న విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఉమాపతికి నోటీసు ఇచ్చారు. ప్రధాన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయినందున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆదివారం జేఏసీ నేతలు విలేకరులకు తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లు ఇవీ..
● నగదు రహిత వైద్యం అందించాలి.
● 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్య చేరిన ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలి.
● దళారీ వ్యవస్థను రద్దు చేసి కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలి.
● మొత్తం 13 రకాల డిమాండ్‌లను పరిష్కరించాల్సి ఉంది. వీటిలో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఆరు డిమాండ్‌లు ఉన్నాయి.
నిరసనలు ఇలా..
● ఈ నెల 15,16 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారు.
● 17, 18 తేదీల్లో భోజన విరామ సమయాల్లో ఆందోళనలు చేపడతారు.
● 19, 20 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తారు.
● 22న ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు మెమొరాండం సమర్పిస్తామని జేఏసీ నేతలు సతీష్‌కుమార్, లక్ష్మీకాంతరెడ్డి, రామరాజు, రమణమూర్తి, సయ్యద్‌బాషా తెలిపారు.