
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. అదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూ లైన్లు నిండి పోయాయి. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.
నేడు టమాట రైతులతో ముఖాముఖి
ప్యాపిలి: టమాట రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ రెడ్డి సోమవారం ప్యాపిలి టమాట్ మార్కెట్‌ను సందర్శించనున్నారు. గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు భరత్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు, నాయకులు మధ్యాహ్నం 2 గంటలకు టమాట మార్కెట్‌కు చేరుకుని రైతులతో ముఖాముఖి కానున్నారు.
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 15న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవడంతో పాటు అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఉద యం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ముగిసిన పెథాలజీ వైద్యుల రాష్ట్ర సదస్సు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో మూడు రోజులుగా కొనసాగుతున్న పెథాలజి వైద్యుల రాష్ట్ర సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మెడికల్ కాలేజీల నుంచి 612 మంది వైద్యులు హాజరైనట్లు ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ బాలీశ్వరి తెలిపారు. వీరిలో 50 మందికి పైగా ప్రొఫెసర్లు, 75 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 150 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 140 మంది పీజీ వైద్యులు ఉన్నారన్నారు. మూడు రోజుల సదస్సుతో సరికొత్త వైద్య విధానాలను సీనియర్ వైద్యులు వివరించారని పేర్కొన్నారు.