
అన్యాయం జరిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయండి
● శాంతిభద్రతలకు విఘాతం
కలిగిస్తే కఠిన చర్యలు
● నూతన ఎస్పీగా బాధ్యతలు
స్వీకరించిన సునీల్ షేరాన్
నంద్యాల: అన్యాయం జరిగితే ప్రజలు పోలీసు స్టేషన్‌లో నిర్భయంగా ఫిర్యాదు చేసేలా వాతావరణం కల్పిస్తానని జిల్లా నూతన ఎస్పీ సునీల్ షేరాన్ అన్నారు. విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా పని చేస్తున్న ఆయన నంద్యాల జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చారు. ఈ మేరకు ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తూ బదిలీ అయిన ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా నుంచి ఆదివారం సునీల్ షేరాన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావళి ఆల్ఫోన్స్, సాయుధ బలగాల అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు డీఎస్పీలు ప్రమోద్, రామాంజినాయక్‌లతో పాటు సీఐలు, ఎస్‌ఐలు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెంచేలా సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటామ న్నారు. జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంతో పాటు ప్రజల శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.