
దివ్యాంగుల కడుపుకొట్టొద్దు
నంద్యాల(న్యూటౌన్): దివ్యాంగుల వైకల్య శాతం తగ్గించి కడుపుకొట్టొద్దు అని డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్‌వలి, వికలాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు మరియదాసులు అన్నారు. కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల వైకల్య శాతం తగ్గించి పింఛన్లు తీసేయడాన్ని నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పుట్టుకతోనే దివ్యాంగులైన వారికి వయస్సు రీత్యా వైకల్య శాతం మరింత పెరుగుతుందన్నారు. 2009 నుంచి 2019 వరకు ప్రభుత్వం సదరన్ సర్టిఫికెట్లు మంజూరు చేసి స్లాబ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. రీ వెరిఫికేషన్‌లో కొందరు వైద్యులకు అవగాహన లేకపోవడంతో ఎంతో మంది పింఛన్ కోల్పోయే ప్రమాదం ఏర్పండిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాలు, బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు, రాజ్యాంగం కల్పించిన మౌలిక వసతులు, విద్యా, వైద్యం, ఉపాధి, రక్షణ తదితరరంగాల్లో అవకాశాలను పొందలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జేసీ విష్ణుచరణ్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం మహిళా అధ్యక్షురాలు శివనాగమ్మ, అధ్యక్షులు అబ్దుల్, సభ్యులు ఖాదర్‌బాషా, గోపాల్, ఎల్లయ్య, సత్తార్‌బాషా, లింగమ్మ, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.