రైతులను వెంటాడుతున్న యూరియా కష్టాలు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం అన్నదాతల ఆవేదన

Sep 9 2025 12:24 PM | Updated on Sep 9 2025 1:32 PM

జిల్లాకు అరకొర కేటాయింపు

అందులో సగం దారి మళ్లింపు

డీలర్లు, టీడీపీ నేతలు బ్లాక్‌లో విక్రయాలు

నేడు వైఎస్సార్‌సీపీ ‘అన్నదాత పోరు’

ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ఆందోళనలు

కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం.. టీడీపీ నేతల బ్లాక్‌ దందా వెరసి.. జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. విస్తారంగా వర్షాలు పడటంతో వరి, మొక్కజొన్న, మినుము, సోయాచిక్కుడు, మిరప, బెండ, తదితర పంటలు సాగు అయ్యాయి. పంటలకు పైపాటుగా యూరియా వేసుకోవాలని అటు వ్యవసాయాధికారులు, ఇటు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో వైపు వరినాట్లు పూర్తయి 40 రోజులు గడిచాయి. ఈ పరిస్థితుల్లో యూరియా కోసం అన్నదాత పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. డీఏపీ, కాంప్లెక్స్‌ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అడపా దడపా ఆర్‌ఎస్‌కే, సహకార సొసైటీలకు వస్తున్న యూరియా ఒకటి, రెండు ప్యాకెట్లతో సరిపెడుతుండటంతో ఏ మూలకు సరిపోక ఆందోళన చెందుతున్నారు. 

జిల్లాలో ఈ ఏడాది సరాసరి ఖరీఫ్‌ సాగు లక్ష్యం 2.01 లక్షల హెక్టార్లు కాగా ఇంత వరకు 1.91 లక్షలు హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుయ్యాయి. కేసీ కెనాల్‌, తెలుగుగంగ, ఎస్సార్బీసీ కాల్వలతో పాటు కుందూ పరీవాహక ప్రాంతాల్లో వరి ప్రధాన పంటగా ఉంది. ఈ ఏడాది 58,251 హెక్టార్లలో వరి సాగు అయ్యింది. ప్రస్తుతం 40 నుంచి 50 రోజుల మధ్య పంట ఉంది. 50 రోజులకు ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇప్పటి వరకు మూడు బస్తాల యూరియా వేయాల్సి ఉంది. జిల్లాలో రైతులకు 44,778 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు ఇప్పటి వరకు జిల్లాకు 26,500 మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చింది.

బ్లాక్‌ మార్కెట్‌ సృష్టిస్తున్న కూటమి నాయకులు..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులను గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేవారు. రైతులకు అవసరమైన ఎరువులను రైతు భరోసా కేంద్రాల్లోని కియోస్క్‌ మిషన్‌లో నమోదు చేసుకొని వెంటనే యూరియా తీసుకునేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో బస్తాలను టీడీపీ నాయకులు రైతులకు దొరకకుండా బ్లాక్‌ మార్కెట్‌ సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ధర ప్రకారం యూరియా బస్తా రూ.266.50 కాగా బ్లాక్‌ మార్కెట్లో రూ.400 నుంచి 500 వరకు అమ్ముతున్నారు. కూటమి నాయకులే బ్లాక్‌ మార్కెట్‌ సృష్టిస్తూ రైతులకు తీవ్రంగా యూరియా కొరత సృష్టిస్తున్నారు. అధికారులు మాత్రం యూరియా కొరత లేదని చెబుతున్నప్పుడు మళ్లీ రైతులు క్యూలైన్‌లో నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు నెలకొంటుందో అధికారులే సమాధానం చెప్పాలి.

ప్రభుత్వం ఎకరాకు ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తోంది. అది కూడా ఇవ్వడానికి రైతులను అధికారులు క్యూలైన్లలో రోజుల తరబడి నిలబెడుతున్నారు. క్యూలైన్‌లో నిలుచుంటున్నా దొరకని పరిస్థితి. టీడీపీ నాయకులు చెప్పిన వారికే ఎన్ని కావాలంటే అన్ని బస్తాలు దక్కుతున్నాయి. నిజమైన రైతులు బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి నెలకొంది.

– మధుబాబుగౌడ్‌, రైతు, కానాల గ్రామం, నంద్యాల(మం)

నేను ఐదు ఎకరాల్లో ఆగస్టు మాసంలో వరిపైరు సాగు చేశా. ఒక్క ఎకరాకు మూడు బస్తాల యూరియా వేయాల్సి ఉండగా అధికారులు ఒక బస్తా మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన 9 బస్తాల యూరియాను ప్రైవేటుగా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. రాబోయే కాలంలో మరింత యూరియా అవసరం ఉంది. ఆర్‌ఎస్‌కేల ద్వారా అందే పరిస్థితి కనిపించడం లేదు.

– సర్వేశ్వరరెడ్డి, గడివేముల, ఆర్లగడ్డ గ్రామం

రైతులు భారీగా తరలిరావాలి
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9వ తేదీన జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నంద్యాల, డోన్‌, ఆత్మకూరు సబ్‌ డివిజన్‌ కేంద్రాల్లో రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్‌డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి వినతి పత్రం అందజేస్తాం. ఎరువులను పక్కదోవ పట్టిస్తూ బ్లాక్‌ మార్కెట్‌ సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. మంగళవారం ఉదయం బొమ్మలసత్రంని వీ మార్ట్‌ సర్కిల్‌ నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వరకు ర్యాలీ ప్రారంభమవుతోంది. ఈ ర్యాలీలో పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి రైతులు భారీగా తరలిరావాలి.

– కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, నంద్యాల

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేడు నిరసన..

జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రైతులకు సరిపడ ఎరువులు అందజేయాలని కోరుతూ ఈనెల 9వ తేదీన మంగళవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు, డోన్‌ సబ్‌ డివిజన్లలో ఆర్‌డీఓ కార్యాలయాల వరకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయంలోని ఆర్‌డీఓలకు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement