
విద్యుదాఘాతంతో వలస కార్మికుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని చెన్నాపురం గ్రామం సమీపంలోని స్టోన్ క్రస్రర్ మిషన్ ఫ్యాక్టరీ దగ్గర మంగళవారం ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై సంతోష్ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ యువకుడు కొన్ని రోజు క్రితం తమ ప్రాంతానికి చెందిన మేసీ్త్ర ద్వారా చెన్నాపురం స్టోన్ క్రస్రింగ్ మిషన్ ఫ్యాక్టరీలో పనిలో చేరాడు. రోజు మాదిరిగానే ఉదయం ఫ్యాక్టరీ దగ్గర వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. అయితే, ఆ సమయంలో వర్షం రావడంతో షార్ట్ సర్క్యూట్‌కు గురై కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు సంతోష్‌ను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీస్‌స్టేషన్ ట్రైనీ ఎస్‌ఐ మల్లికార్జున ప్రభుత్వాసుప్రతికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును, మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టుం కోసం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు ప్రమాదం విషయం తెలియజేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు.
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
జూపాడుబంగ్లా: కుటుంబ కలహాలతో మండలంలోని తర్తూరు గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. సి.బెళగల్‌కు చెందిన గనిమల్లేశ్వరి (23)కి తర్తూరు గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కొడుకు, కుమార్తె సంతానం. భర్త మతిస్థిమితం లేకపోవటం, మామ వెంకటేశ్వర్లు దివ్యాంగుడు కావడంతో కుటుంబపోషణ భారమంతా గనిమల్లేశ్వరిపై పడింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె మంగళవారం పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం నందికొట్కూరుకు తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గ్రామానికి చేరుకొని బోరున విలపించారు. మల్లేశ్వరి మృతికి భర్త, మామే కారణమని వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మెట్లపై నుంచి జారి లారీ డ్రైవర్ మృతి
బేతంచెర్ల: పట్టణంలోని బైటిపేట కాలనీకి చెందిన ఓ లారీ డ్రైవర్ మెట్లపై నుంచి జారీ పడి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర్ వివరాల మేరకు.. సానె దుశ్యంత్ కుమార్ (33) సోమవారం ఇంటి పైనుంచి కిందికి వచ్చే క్రమంలో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నంద్యాల శాంతిరామ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర్ మంగళవారం వెల్లడించారు.
డివైడర్‌ను ఢీకొన్న కారు
కర్నూలు (రూరల్): కారు అతివేగంతో డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలు.. హైదరాబాదుకు చెందిన సోదరులు శివ, మంజునాథ్, శివ సతీమణి, కూతురుతో కలిసి బెంగళూరులో గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై తిరుగు పయనమయ్యారు. సోమవారం అర్ధరాత్రి పంచలింగాల సమీపాన శివ కారును వేగంగా నడపడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పక్కన కూర్చున్న సోదరుడు మంజునాథ్ (42) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో శివ, ఆయన భార్య, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తాలూకా అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు.

విద్యుదాఘాతంతో వలస కార్మికుడి మృతి

విద్యుదాఘాతంతో వలస కార్మికుడి మృతి