
అట్టహాసంగా బిషప్ పట్టాభిషేకం
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల డయాసిస్ బిషప్‌గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. హోలీక్రాస్ కెథడ్రల్ సెంటినరీ చర్చి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి నంద్యాల డయాసిస్ పరిధిలో ఉన్న పాస్టరేట్ డీనరీ చైర్మన్లు, పాస్టర్లు, కౌన్సిల్ మెంబర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(చైన్నె) మోడరేటర్ రూబెన్ మార్క్ నూతన బిషప్ సంతోష్ ప్రసన్నరావుతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. సంతోషరావు క్రమంగా బిషప్ స్థాయికి ఎదగడం అభినందనీయమని చెప్పారు. అవినీతికి తావు లేకుండా నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రమాణ స్వీకారం అనంతరం బిషప్ ప్రసన్నరావును రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంఎస్‌నగర్ నుంచి ఊరేగింపు నిర్వహించారు. హోలీక్రాస్ కెథడ్రల్ ఆలయ ఆవరణలో బిషప్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో బిషప్‌లు ఐజక్ వరప్రసాద్, జార్జికొర్నెలి, పద్మారావు, తిమోతి, రవీందర్, హేమచంద్రకుమార్, జయసింగ్ ప్రిన్సిన్స్ ప్రభాకరన్‌లతో పాటు డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్, డయాసిస్ సెక్రటరీ స్టాండ్లీ విలియం, సెంటినరీ చర్చి సెక్రటరీ ప్రభుదాసు, నందం ఐజక్‌తో పాటు అన్ని పాస్టరేట్ల డీనరీ చైర్మన్లు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం చైన్నె కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
క్రీస్తు మార్గంలో నడుస్తా
క్రీస్తు బోధనలు అనుసరిస్తూ ఆయన అడుగు జాడల్లో నడుస్తానని నంద్యాల డయాసిస్ అధ్యక్ష ఖండం పీఠాధిపతి(బిషప్) సంతోష్ ప్రసన్నరావు అన్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. డయాసిస్ పరిధిలో ఉన్న ఆస్తులను కాపాడుతూ, నంద్యాలలో విద్య, వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
అవినీతికి తావు లేకుండా నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేయాలి
నూతన బిషప్ సంతోష్ ప్రసన్నరావుకు మోడరేటర్ రూబెన్‌మార్క్ పిలుపు

అట్టహాసంగా బిషప్ పట్టాభిషేకం