
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
ఎమ్మిగనూరురూరల్: పెసలదిన్నె గ్రామంలో విద్యుదా ఘాతంతో కౌలు రైతు మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన నరసింహుడు కుమారుడు బోయ కృష్ణమూర్తి(34) తనకు ఉన్న ఎకరన్నరతో పాటు 5 ఎకరాలు కౌలు తీసుకోని పత్తి పంటను సాగు చేస్తున్నాడు. ఆదివారం రాత్రి భోజనం అనంతరం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. పొలం దగ్గర ట్రాన్స్ ఫార్మర్ కింద నున్న బోర్డులో ఉన్న స్విచ్ వేసే క్రమంలో కరెంట్ షాక్‌కు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రయినా ఇంటికి రాకపోవటం, కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానంతో తండ్రి నరసింహుడు, మరో వ్యక్తితో కలసి పొలం దగ్గరకు వెళ్లి చూశారు. ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో విగత జీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. మృతుడుకి భార్య సరోజ, కుమార్తె మానస(1) ఉన్నారు. సోమవారం విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్లి జరిగి న సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.