
టీడీపీ నాయకులే ఎరువులు అమ్మేస్తున్నారు
● యూరియా కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయిస్తున్నారు
● జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌కు వినతిపత్రం ఇచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు
నంద్యాల: ఎరువులను రైతులకు ఇవ్వకుండా టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డిలు ఆరోపించారు. డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా టీడీపీ నాయకులు పనిచేస్తున్నారని విమర్శిచారు. జిల్లాలో యూరియాతో సహా ఎరువుల కొరత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ పీపీనాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వంగాల మహేశ్వర రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌ను కలిశారు. రైతుల సమస్యలపై చర్చించి వినతి పత్రం అందజేశారు.
● కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు కష్టాలు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షలు చేసే పరిస్థితి కూడా కనిపించడంలేదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా కక్షసాధింపు , డైవర్షన్ రాజకీయాలకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి రూ.20వేలు చొప్పున రెండు సంవత్సరాలకు ప్రతీ రైతుకు రూ.40వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5వేలు మాత్రమే ఇచ్చారన్నారు.
● శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని రైతులకు యూరియా ఎరువులు దొరకడం లేదని, టీడీపీ నాయకులు బ్లాక్ చేసి అమ్ముకుంటున్నారన్నారు. అధికారులు పంపిణీ చేయాల్సిన ఎరువులను టీడీపీ నాయకులు ముందుండి టీడీపీ కార్యకర్తలకే అందజేస్తున్నారన్నారు. ఎరువుల కొరతతో రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
● గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ.. నిజమైన రైతులకు ఎరువులు అందకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. టీడీపీ నాయకులే అధిక ధరలకు ఎరువులు పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు.
● రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ.. యూరియా బస్తాపై బ్లాక్ మార్కెట్లో రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, అధిక రేట్లు పెట్టి ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద ఎరువులు రైతులు కొనాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. ఎరువులను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. రైతులకు అందుబాటులో ఎరువులు ముఖ్యంగా యూరియా దొరక్కపోవడంతో ఎక్కడకు వెళ్లాలో రైతులకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ.. రైతుకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ అండగా ఉన్న ఆర్‌బీకేల వ్యవస్థను పూర్తిగా కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. గ్రామస్థాయిలో రైతులకు చేదోడుగా ఉన్న వ్యవస్థలను ధ్వంసం చేసి రైతులను రోడ్డు పాలు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.