
భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి
ఆత్మకూరు: భూ సమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, రెవెన్యూ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మార్గదర్శి కుటుంబాలను నమోదు చేయాలన్నారు. వాట్సాప్ గవర్నర్స్, మనమిత్రపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గాల్లో అవగాహన కల్పించేలా ర్యాలీ నిర్వహించాలన్నారు. ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ రత్నరాధిక, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
అర్జీలు కొన్ని..
● తనకున్న 2.80 ఎకరాల భూమిని శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్ కోసమని ప్రభుత్వ భూమిగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారని, దాన్ని పట్టా భూమిగా మార్చాలని ఆత్మకూరు మండలం పాములపాడు గ్రామానికి చెందిన బాలస్వామి అర్జీ ఇచ్చారు.
● తనకున్న భూమిపై ఆర్వోఆర్ కింద నోటీసులు ఇచ్చారని, తన పేరును అసైన్డ్ నుంచి తొలగించారని, న్యాయం చేయాలని బండిఆత్మకూరు మండం బోదనం గ్రామానికి చెందిన పెద్దన్న అర్జీ ఇచ్చారు.
● కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామానికి చెందిన 39 ఎస్సీ కుటుంబాలవారికి చెందిన భూములు వివిధ కారణాలతో ఆన్‌లైన్‌లో చూపలేదని, చర్యలు తీసుకోవాలని అర్జీ ఇచ్చారు.
● ఆత్మకూరు మండలంలోని పెచ్చెరువు చెంచు గూడెంలో చెంచు గిరిజనులకు ఇంతవరకు పొలాలు చూపలేదని, ఎలాంటి పట్టాలు కూడా మంజూరు చేయలేదని న్యాయం చేయాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు అర్జీ ఇచ్చారు.
● శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలిన వినతిపత్రం ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి