
8 నుంచి శ్రీ రాఘవేంద్రుల ఆరాధనోత్సవాలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన ఉత్సవాలకు సకల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు తెలిపారు. ఈనెల 8 నుంచి 13వ తేది వరకు రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనేపథ్యంలో సోమవారం శ్రీ మఠం గురునివాస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పీఠాధిపతి మాట్లాడుతూ ఆరు రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా 10వ తేదీన పూర్వరాధన, సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం, కాంచీపురం వరదరాజులు, శ్రీరంగపట్నం రంగనాథ స్వామి ఆలయాల నుంచి పట్టువస్త్రాల సమర్పణ ఉంటుందన్నారు. 11వ తేదిన మద్యారాధనలో భాగంగా మూలబృందావనానికి మమాపంచామృతాభిషేకం, పాదుకా పట్టాభిషేకం, స్వర్ణరథోత్సవం నిర్వహిస్తామన్నారు. 12వ తేదిన ఉత్తారారాధనలో భాగంగా మూలబృందావనానికి వజ్రరత్నకవచధారణ, వసంతోత్సవం, మహారథోత్సవం కనులపండువగా చేపడతామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక దర్శన క్యూలైన్లు ఏర్పాటు చేశామని.. వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణిలు, వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్ సదుపాయం కల్పిస్తామన్నారు.