
ఆర్టీసీ బస్టాండ్లలో మెరుగైన వసతులు
నంద్యాల(వ్యవసాయం): జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రజియాసుల్తానా శుక్రవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని బనగానపల్లె, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, కోవెలకుంట్ల, డోన్ డిపోలలో సీటింగ్ చైర్స్ వేయడం జరుగుతుందన్నారు. నంద్యాలలో 20 ఫ్యాన్లు, బనగానపల్లెలో 8 ఫ్యాన్లు ఏర్పాట్లు చేశామన్నారు. 23 హైటెక్ బస్సులలో పల్లెవెలుగుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థి బస్సుల ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో అదనపు ట్రిప్పులు తిప్పుటకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జిల్లాకు 36 సూపర్‌లగ్జరీ, 32 ఎక్స్‌ప్రెస్ బస్సులు రావడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని పల్లెవెలుగు బస్సుల కండీషన్ చెక్ చేసి అవసరమైన మరమ్మతులు చేయబడుతుందన్నారు. ఉచిత టికెట్ జారీ చేసే పద్ధతి గురించి కండెక్టర్లకు, డ్రైవర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.
రోజా దర్గా భూమి అన్యాక్రాంతం
కర్నూలు(అర్బన్): కర్నూలులోని సయ్యద్ ఇషాక్‌సనుల్లా ఖాద్రి అలియాస్ సయ్యద్ ఖాద్రి మియా సాహెబ్ (ఆర్‌హెచ్) రోజా దర్గాకు సంబంధించి సర్వే నంబర్ 218లోని 19.65 సెంట్ల భూమి అన్యాక్రాంతమైనట్లు వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ షేక్ ముక్తార్ బాషా తెలిపారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఆదేశాల మేరకు.. కల్లూరు పరిధిలోని ముజఫర్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఈ భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ భూమి వెంచర్ ఫ్లోటింగ్ అయ్యిందని, ఆక్రమణ, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు తమ పరిశీలనలో తెలిసిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ ద్వారా ఆర్‌డీఓ, జిల్లా రిజిస్ట్రార్‌కు నివేదికలు అందించామన్నారు. భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.